టికెట్ రద్దు చేసుకున్నాక తనకు రీఫండ్ రూ.35 తక్కువగా వచ్చిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని రెండేళ్ల పాటు ఐఆర్సీటీసీపై పోరాడారు రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఓ యువ ఇంజినీర్. మొత్తానికి రైల్వే నుంచి రెండేళ్ల తర్వాత రూ.33 రీఫండ్ పొందారు.
2017 ఏప్రిల్ టికెట్ బుక్..
సుజీత్ స్వామి అనే ఇంజినీర్ ఏప్రిల్ 2017లో జీఎస్టీ అమలులోకి రాకముందు.. ఆ ఏడాది జులై 2న కోటా నుంచి దిల్లీ వెళ్లేందుకు ఐఆర్సీటీసీ నుంచి రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత టికెట్‌ను రద్దు చేసుకున్నారు. టికెట్ ధర రూ.765. టికెట్ రద్దు చేసుకున్నాక ఆయన రూ.655ను రీఫండ్‌గా పొందారు.
" వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే సాధారంగా రూ.65 మాత్రమే పోయి మిగతాది రీఫండ్ రావాలి. కానీ రూ.100 కోత విధించారు. 2017 నుంచి ఈ విషయంపై పోరాడుతున్నా. ఐఆర్సీటీసీ మాత్రం ఆ మొత్తం రీఫండ్ అవుతుందని చెప్పింది" - సుజీత్ స్వామి
రెండేళ్లుగా అలుపెరుగని పోరాటం
సుజీత్ టికెట్ బుక్ చేసుకున్న సమయానికి జీఎస్టీ అమలులో లేకపోయినా రూ.35లను సేవా పన్ను కింద చార్జ్ చేసింది రైల్వే.
దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఐఆర్సీటీసీని ప్రశ్నించారు సుజీత్ స్వామి. జీఎస్టీ అమలులోకి రాకముందు టికెట్ బుక్ చేసుకొని, ఆ తర్వాత రద్దు చేసుకుంటే సేవా రుసుము రీఫండ్ కాదని చెప్పింది ఐఆర్సీటీసీ. అయితే 2017 జులై 1 ముందు బుక్ చేసుకొని రద్దు చేస్తే సేవా పన్ను కూడా రీఫండ్ చేస్తామని చెప్పింది. తమ రూ.35ను రీఫండ్ చేస్తామని 2017లోనే స్వామికి చెప్పింది ఐఆర్సీటీసీ.
రెండేళ్ల తర్వాత రూ.33
అయితే దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మే 1న రూ.33లను బ్యాంకు ఖాతా ద్వారా అందుకున్నారు స్వామి.