కేరళ నుంచి హిమాలయాలకు సైకిల్ యాత్ర- ఖర్చు ఎంతంటే... హతీమ్ ఇస్మాయిల్, సలాం... ఇద్దరూ స్నేహితులు. ఇస్మాయిల్ ఉండేది కేరళలోని అరికోడులో. సలాంది కిళిస్సెరి. సైకిల్‌పై హిమాలయాలకు యాత్ర చేయాలన్నది వారి కల. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇప్పుడు ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ఇలా మొదలై..
సెప్టెంబర్ 16న కేరళ వళక్కడ్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రారంభమైంది ఇస్మాయిల్, సలాంల సైకిల్ యాత్ర. కశ్మీర్ వరకు వెళ్లాలన్నది వారి లక్ష్యం. అయితే.. తీవ్రమైన మంచు కారణంగా ముందుకు సాగే మార్గం లేదు. అందుకే వారి సాహస యాత్ర హిమాచల్ ప్రదేశ్ మనాలీకి సమీపంలోని రోహ్తాంగ్పాస్ దగ్గర ముగిసింది.
ఖంగు తినేంత తక్కువ ఖర్చుతో
వీరి యాత్ర కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హరియాణా, దిల్లీ, పంజాబ్, ఛండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా సాగింది. ఇంత సుధీర్ఘ ప్రయాణానికి వారి పెట్టిన ఖర్చెంతో తెలుసా..? కేవలం రూ. 4500/-. ఎందుకంటే ఎలాంటి విలాసవంతమైన సౌకర్యాలు లేకుండా, ఖరీదైన హోటళ్లలోబస చేయకుండా యాత్ర పూర్తి చేయడమే వారి లక్ష్యం.
"కేరళ తప్ప మిగతా రాష్ట్ర ప్రజలపై నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ, ఈ యాత్రలో ఏ రాష్ట్రానికి వెళ్లినా గ్రామస్థులు అందించిన సాయం నా దృష్టి కోణాన్ని మార్చేసింది. చాలా అందమైన పట్టణాలను నేను చూడగలిగాను."
-హతీమ్
రోజూ ఇంత దూరం
హతీమ్, సలాం ప్రతిరోజు 100 కి.మీ నుంచి 170 కి.మీ వరకు ప్రయాణించారు. ప్రతి తెల్లవారుజామున ప్రారంభమైన వారి యాత్ర సాయంత్రం 6 గంటల వరకు సాగేది.
అయితే.. హిమాలయాలు చేరుకున్నాక ఈ స్పీడు కాస్త తగ్గింది. రోజుకు 25 కి.మీ నుంచి 50 కి.మీ ప్రయాణించారు. ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఆ మాత్రం ప్రయాణించడం కూడా గొప్పే మరి.
ఇదీ చదవండి:ఈ పత్రం లిఖించాక.. ఆరునూరైనా పెళ్లి జరగాల్సిందే!