ఈ ఏడాది గడిచిన 5 నెలల్లో 101 మంది తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో 2019 జనవరి నుంచి మే 31 వరకు 23 మంది విదేశీయులు, 78 మంది స్థానిక తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అన్సార్ ఘాజ్వాత్ ఉల్ హింద్ సంస్థ అధినేత జాకిర్ మూసా లాంటి పెద్ద స్థాయి ఉగ్రవాదులూ ఉన్నారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాయి భద్రత దళాలు. ముష్కరుల ఏరివేతే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి.
భారీగా నియామకాలు
ఓ పక్క తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నప్పటికీ.. ఉగ్రసంస్థల్లోకి నియామకాలు భారీగా జరగటం ఆందోళనకు గురిచేస్తోందని అధికారులు అన్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు పలు తీవ్రవాద సంస్థలు సుమారు 50 మంది యువకులను నియమించుకున్నట్లు తెలిపారు. ఈ నియామకాలకు అడ్డుకట్ట వేయాటానికి సరైన మార్గాన్ని వెతకాల్సిన అవసరముందని, తప్పుతోవ పడుతోన్న యువత, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని వెల్లడించారు.