తమ కుమార్తెకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నలుగురు దోషుల ఉరితో తాము ఇప్పుడు మరింత సురక్షితంగా ఉన్నట్టు మహిళలు భావిస్తారని అభిప్రాయపడ్డారు. కానీ తమ పోరాటం ఇక్కడితో ఆగదని.. న్యాయవ్యవస్థలోని లొసుగుల్లో మార్పు వచ్చే వరకు శ్రమిస్తానని నిర్భయ తల్లి స్పష్టం చేశారు.
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఈ రోజు ఉదయం 5:30 గంటలకు తిహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తెపై తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు నిర్భయ తల్లి.
"నా కూతురును తలచుకుంటే ఈరోజున నాకు ఎంతో గర్వంగా ఉంది. 'నిర్భయ' పేరుతో ఈ రోజు ప్రపంచం నాకు సెల్యూట్ చేసింది. నిర్భయ తల్లిగా నన్ను ప్రపంచం గుర్తించింది. జన్మనిచ్చినప్పటికీ.. తనను నేను కాపాడుకోలేకపోయాను. నిర్భయపై ఘోర నేరం జరిగింది. ఇది నన్ను ఎప్పటికీ బాధపెడుతుంది. కానీ తను ఇప్పుడు ఉండుంటే.. నన్ను ఓ డాక్టర్కి తల్లి అని పిలిచేవారు. కానీ ఈరోజు నిర్భయకి తల్లిగా నన్ను చూస్తున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. కానీ ఇక్కడితో మా పోరాటం ఆగదు. ప్రభుత్వంతో మాట్లాడతాం. కోర్టుకు వెళ్తాం. కొత్త మార్గనిర్దేశకాలు ఇవ్వాలని సుప్రీంను అభ్యర్థిస్తాం. ఉరిని ఆలస్యం చేయడానికి జరిగిన కుట్రలు అందరూ చూశారు. కోర్టులో వేసే పిటిషన్లకు తగిన గడువు ఉండాలి. ఒకేసారి శిక్ష అమలు చేయాలన్నప్పుడు ఒకేసారి వ్యాజ్యాలు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయాలన్న నియమం తీసుకురావాలి. అది కూడా తగిన గడువులోనే చేయాలి."