తుపాను కారణంగా జరిగే ఆస్తి, ఆర్థిక నష్టాన్ని తగ్గించేందుకు ఆయా ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు భారత వాతావరణం సంస్థ డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహాపాత్రా. దిల్లీలో 'చేజింగ్ ద సైక్లోన్' పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీ.... కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యవస్థ వల్ల ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించగలమని ధీమా వ్యక్తం చేశారు.
నూతన వ్యవస్థ ద్వారా తుపాను ధాటికి దెబ్బతినే ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు. దీనితో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వవచ్చు. తద్వారా అన్ని విపత్తు నిర్వహణ సంస్థలు తగు చర్యలను చేపడతాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలో నష్టనివారణ చాలా అవసరం. దీన్నే మేము లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఈ వర్షాకాలం నుంచి ప్రభావపూరిత తుపాను హెచ్చరికను ప్రారంభిస్తాము.
-మృతుంజయ్ మహాపాత్రా, ఐఎండీ డీజీ