దేశ రాజధాని దిల్లీలో అక్టోబర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని జాతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. 58ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లుఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా దిల్లీలో అక్టోబర్ నెలల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదవుతుంటాయి. అయితే.. ఈ అక్టోబర్‌లో 17.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. 1962లో నమోదైన 16.9 డిగ్రీల సెల్సియస్ తర్వాత ఇదే అత్యల్పం అని ఐఎండీ తెలిపింది.
గత గురువారం(అక్టోబర్ 29న) దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5 డిగ్రీ సెల్సియస్‌గా రికార్డైంది. 26 ఏళ్లలో అంటే 1994 తర్వాత అక్టోబర్ నెలలో ఒక్కరోజులో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇదే కావడం గమనార్హం. అయితే.. ఆకాశం మేఘావృతమవడం, మబ్బులు కమ్మేయడం వల్లే.. ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి పడిపోయాయని ఐఎండీ ప్రాంతీయ డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు.