లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ నూతన మంత్రివర్గంలో కొత్త ముఖాలు కనబడతాయని పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో కేబినెట్‌లో అమిత్‌షా చేరటం ఖాయమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కీలకమైన హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖల్లో ఒకటి ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే సుష్మా ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారన్న పాత్రికేయుల ప్రశ్నకు.. అది పార్టీ, ప్రధాని మోదీ నిర్ణయానికి సంబంధించిన విషయమంటూ అమిత్‌షా నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. పార్టీలో మాత్రం అమిత్‌షా ఈసారి కేంద్ర కేబినెట్‌లో చేరటం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది.
రాహుల్‌ను ఓడించిన ఇరానీకి...
ఉత్తరప్రదేశ్ అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గెలిచి చరిత్ర సృష్టించిన స్మృతి ఇరానీకి బహుమతిగా భాజపా నాయకత్వం కీలక మంత్రిత్వశాఖ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కేబినెట్‌లో సభ్యులైన సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్ వంటి వారు నూతన కేబినెట్లోనూ కొనసాగే అవకాశముంది.
మిత్రపక్షాలకు...