నేడు గుజరాత్ తీరాన్ని తాకనున్న 'వాయు' తుపాను 'వాయు' తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని వెరావల్, ద్వారక మధ్య తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో గంటకు 150 నుంచి 180 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తుపాను విపత్తు నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తూ ట్వీట్ చేశారు.
రైళ్లు రద్దు..
వాయు తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే 70 రైళ్లను రద్దు చేసింది. మరో 28 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే తీర ప్రాంత ప్రజలను తరలించడానికి ప్రత్యేకంగా రైళ్లను నడపాలని నిశ్చయించింది. ముఖ్యంగా రాజ్కోట్, భావ్నగర్ డివిజన్ల ప్రజలను తరలించడానికి పశ్చిమ రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు...
తుపాను వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నందున గుజరాత్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు చెందిన పది జిల్లాల్లోని సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన దీవ్లో పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో... కోస్ట్ గార్డ్, వాయు, నౌకా, సైనిక దళాలు, సరిహద్దు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు అమిత్షా తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి (ఎన్డీఆర్ఎఫ్) చెందిన 52 బృందాలు స్థానిక అధికార యంత్రాంగాలకు సహాయంగా పనిచేస్తున్నాయని అన్నారు.
ఇదీ చూడండి: ఆర్డీవో 'హైపర్సోనిక్' పరీక్ష విజయవంతం