మన అనుకునే వాళ్లు వేరొక చోట నివసిస్తుంటే క్షేమ సమాచారం ఉంటే నిశ్చింతగా ఉంటాం. వారినుంచి సమాచారం అందకపోతే హైరానా పడిపోతుంటాం. అయితే ఓ కుటుంబం తమ ఇంటి పెద్ద దిక్కు ఉన్నాడో.. లేడో అనే సందిగ్ధంలోనే గడిపింది. ఎక్కడో ఓ చోట కాలం చేసి ఉంటాడని భావించింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి ఓ ఆశ్రమం నుంచి అందిన కబురు వారి దశాబ్దాల దుఃఖాన్ని దూరం చేసింది.
ఇదీ జరిగింది..
అది 1999వ సంవత్సరం. యూపీకి చెందిన బైజ్నాథ్ పంజాబ్‌లోని మిఠాయి దుకాణంలో పనిచేసేవాడు. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా అతడు అదృశ్యం అయ్యాడు. అప్పటికి బైజ్నాథ్కు 22 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడికి మూడేళ్లు, కుమార్తెకు ఏడాదిన్నర. ఆ సమయంలో బైజ్నాథ్ ఆచూకీ కనుక్కునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది కుటుంబం. అయితే ఎంతకూ ఆచూకీని లభించలేదు.
అయితే కొన్ని మాసాల కిందట గాయాలతో, అనారోగ్యంతో అపస్మారక స్థితిలో అప్నా ఘర్ ఆశ్రమాన్ని చేరాడు బైజ్నాథ్. 8 మాసాలకు పైగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. సంస్థ నిర్వాహకులు బైజ్నాథ్ ఆచూకీని యూపీలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమ తండ్రి బతికే ఉన్నాడనే సమాచారంతో హుటాహుటిన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అప్నా ఘర్ ఆశ్రమానికి చేరారు బైజ్నాథ్ కుమారుడు, సోదరుడు. దశాబ్దాల అనంతరం తన వాళ్లని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు బైజ్నాథ్. ఒక్కటిగా కూడి రోదించారు. 21 ఏళ్ల అనంతరం కలిసిన ఆ కుటుంబాన్ని చూసి అక్కడున్న వారి కళ్లలో నీళ్లు తిరిగాయి.