సాధారణంగా హిందువులు నిశ్చితార్థం రోజు రాసుకున్న లగ్న పత్రిక ప్రకారం పెళ్లి జరిపించడం ఆనవాయితి. అయితే ఏ కారణాలతోనైనా పెళ్లి వాయిదా వేసే వెసులుబాటు ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్లోని గద్దీ సామాజిక వర్గం వారి ఆచారం ప్రకారం పెళ్లి వాయిదా పడే అవకశామే లేదు. ఆరు నూరైనా సరే.. వారు రాసుకునే దస్తావేజుల్లో ఉన్న తేదీకి వివాహ కార్యక్రమాలు జరగాల్సిందే.
లిఖిత పూర్వకంగా.. లిఖ్నోత్రీ
ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం చూస్తే.. గద్దీ వారి వివాహ సంప్రదాయంలోని విశేషాలు ఔరా అనిపించక మానవు. చంబా జిల్లాలో విస్తారంగా ఉండే గద్దీ వర్గంలో పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు దస్తావేజులు రాసుకోవాలి. గద్దీ భాషలో ఇలా రాసుకునే ఈ లగ్న పత్రికను లిఖ్నోత్రీ అంటారు.
ఇదే తొలి ఘట్టం
ఈ తొలి ఘట్టంలో వధూవరుల కుటుంబాలు కలిసి మందిరం వద్దకు వెళ్తారు. అక్కడ పురోహితుడు ఓ పత్రం రాస్తాడు. ఇందులో మంగళస్నానాల సమయం, కన్యాదానం చేయాల్సిన ముహుర్తం నుంచి వధువు.. వరుడి ఇంట్లో కాలుపెట్టే తేదీ వరకు అన్ని ముఖ్య ఘట్టాల రాస్తారు.