స్మార్ట్ఫోన్.. ప్రస్తుత సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని ఎలక్ట్రానిక్ పరికరం. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్కు బానిసలవుతున్నారు. అంతేకాదు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ తనపై తాను నియంత్రణ కోల్పోయి.. యంత్రాలు తనను శాసించే స్థాయికి పడిపోతున్నాడు మానవుడు. అయితే డిజిటల్ విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలు పక్కన పెడితే, ఈ ఎలక్ట్రానిక్ యంత్రాలు మనిషి జీవితాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే వీటి నివారణ చర్యలు ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సామాజిక మాధ్యమాలను వదిలేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మోదీ ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ సహా పీఎంవో ట్విట్టర్ అకౌంట్ల నిర్వహణ బాధ్యతను నారీ శక్తి అవార్డు గ్రహీతలకు అప్పగించనున్నారు. అయితే మోదీ ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక వ్యూహం ఉంటుంది. ప్రస్తుత సమాజం సామాజిక మాధ్యమాల్లో లీనమైపోతున్న నేపథ్యంలో.. ప్రధాని తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక దాగున్న అంతరార్థం ఏమిటో తెలియాలంటే వేచి చూడాలి.
రోజువారీ జీవితంలో భాగమైపోయిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాల బానిసత్వం నుంచి మనిషి బయటపడేందుకు ఒక మార్గం ఉంది అదే "డిజిటల్ డిటాక్స్". ఇదేంటి అనుకుంటున్నారా? డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటమే "డిజిటల్ డిటాక్స్". అయితే అది ఎలా చేయాలో తెలుసుకుందాం.
వారం రోజుల కార్యాచరణ...
ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటమంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటమే. అయితే ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలకు దూరమవడం అంత సులువు కాదు. అందుకే మీకు సెలవులు ఉన్నప్పుడు ఈ ఏడు రోజుల కార్యచరణ అమలు చేయండి.
1. మొదటి రోజు- ఉదయాన్నే మీ చరవాణిలోని 10 యాప్లను తొలగించండి.
2. రెండో రోజు- మీ ఫోన్ డిస్ప్లేని నలుపు తెలుపు రంగుల్లో మాత్రమే పెట్టుకోండి. గ్రేస్కేల్ ఆప్షన్ వాడండి. ఇలా చేస్తే ఫోన్ని పదే పదే చూడాలన్న ఆకాంక్ష కాస్త తగ్గుతుంది.