అసోం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక విజయం సాధించింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ)లోని మూడు దళాలకు చెందిన 1,615 మంది కార్యకర్తలు ప్రభుత్వానికి లొంగిపోయారు. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో తమ ఆయుధాలను సమర్పించారు.
అసోం ప్రభుత్వం బోడో సంస్థలతో ఓ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రానికి, ప్రజల 'బంగారు భవిష్యత్తు'కు మార్గమని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఒప్పందం జరిగిన 3 రోజులకే వీరంతా సరెండర్ అవటం విశేషం.
అసోం: 1,615 మంది బోడో ఉద్యమకారులు సరెండర్ లొంగిపోయిన వారిలో ఎన్డీఎఫ్బీ ప్రోగ్రెసివ్కు చెందిన 836 మంది, ఎన్డీఎఫ్బీ రన్జన్ డైమరీ వర్గానికి చెందిన 579 మంది, బి సౌరైగ్వ్రా నేతృత్వంలోని 200 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ఉన్న ఏకే-47లు, లైట్ మిషన్, స్టెన్ తుపాకీలతో సహా మొత్తం 4,800 ఆయుధాలను సమర్పించారు.
"దేశంలోనే కాకుండా, ఆగ్నేయాసియాలోనే అభివృద్ధి రాష్ట్రంగా అసోం నిలవడానికి మేం కృషి చేస్తున్నాం. హింసా మార్గాన్ని వదిలి అభివృద్ధిలో ముందుకు సాగటానికి వీరంతా ముందుకు వచ్చారు."
- శర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి.