సాధారణంగా అద్దె కోసం వెళ్లిన వారిని.. ఎంత మంది ఉంటారు, ఏం చేస్తారు వంటి విషయాలు అడిగి నచ్చితే ఇల్లు అద్దెకు ఇస్తారు. కానీ బెంగళూరుకు చెందిన యజమానులు మాత్రం కొత్తకొత్త నిబంధనలు పెడుతున్నారు. అద్దెకు ఉండే వ్యక్తి ఫలానా కళాశాలలో మాత్రమే చదివితేనే ఇల్లు అద్దెకు ఇస్తామని చెబుతున్నారు. సాలరీ స్లిప్స్ ఇవ్వాలని కొందరు.. లింక్డ్ఇన్ ఖాతా వివరాలు ఇవ్వాలని మరికొందరు యజమానులు అడుగుతున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే ఇల్లు అద్దెకు ఇస్తామంటున్నారు. బెంగళూరులో అద్దె ఇంటి కోసం తిరిగిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రియాంశ్ జైన్ అనే వ్యక్తి తన వ్యక్తిగత వివరాలు చెప్పి అద్దెకు ఇల్లు కావాలని ఓ బ్రోకర్‌ను సంప్రదించాడు. స్పందించిన బ్రోకర్ ఏ కళాశాలలో చదువుతావని ప్రశ్నించగా.. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటికే 'నీ ప్రొఫైల్ మ్యాచ్ కావడం లేదు' అంటూ తిరస్కరించారు. ఐఐటీ, ఐఐఎం, సీఏ, ఐఎస్బీ విద్యార్థులకు మాత్రమే అద్దెకు ఇస్తామని తేగేసి చెప్పారు.