Azadi Ka Amrit Mahotsav: భోపాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సెహోర్. ఆంగ్లేయుల కనుసన్నల్లో భోపాల్ సంస్థానం నవాబు సికిందర్ జహన్ బేగం పాలనలో ఉండేది. నవాబు సైన్యంతో పాటు ఆంగ్లేయుల సైన్యం కూడా అక్కడే ఉండేది. రెండింటిలోనూ భారతీయులే సిపాయిలు. మేరఠ్, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో మొదలైన 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రభావం సెహోర్‌పై కాస్త ఆలస్యంగా పడింది. మేరఠ్, ఇండోర్‌ల నుంచి తిరుగుబాటు పోస్టర్లు సెహోర్ దళంలో కదలిక తెచ్చాయి. ఒకరిద్దరు నోరెత్తినా ఆంగ్లేయులు వారిని ఆదిలోనే అణచివేశారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. 1857 జులైలో హోల్కర్ సంస్థాన సైన్యం... ఇండోర్‌లోని బ్రిటిష్ కంటోన్మెంట్‌పై దాడి చేసింది. ఆంగ్లేయుల రాజకీయ ప్రతినిధి హెన్రీ మరియన్ డ్యూరాండ్ పారిపోయి... సెహోర్ చేరుకున్నాడు. మిగిలిన చోట్ల ఆంగ్లేయులను తరుముతుంటే... తాము వారికి రక్షణగా నిలవటమేంటని సిపాయిల్లో ఆలోచన మొదలైంది. ఇండోర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న 14 మంది భోపాల్ సిపాయిలు తిరుగుబాటు చేసి రావటంతో సెహోర్ సిపాయిల్లోనూ ధైర్యం వచ్చింది. దీంతో ఆంగ్లేయ అధికారులు అక్కడి నుంచీ పరారయ్యారు
ఆగ్రహించిన భోపాల్ బేగం... తిరుగుబాటుదారులను గుర్తించాల్సిందిగా తన అనుచరులను పంపించింది. ఈ చర్య సిపాయిలను మరింత రెచ్చగొట్టింది. ఇంతలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారంటూ హవల్దార్ మహవీర్, సుబేదార్ రామ్‌జులాల్, రిసాల్దార్ వలీషా, ఆరిఫ్‌లను సైన్యం నుంచి బహిష్కరించటమేగాకుండా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అగ్నికి ఆజ్యం పోసింది. వలీషా, మహవీర్‌ల నాయకత్వంలో సెహోర్ దళం తిరుగుబాటు జెండా ఎగరేసింది. భోపాల్ బేగం ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతుండటంతో వీరంతా అటు బేగంపైనా, ఇటు ఆంగ్లేయ సర్కారుపైనా తిరుగుబాటు చేసి ‘సిపాయి బహదూర్ సర్కార్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారిక కార్యాలయాల నుంచి బ్రిటిష్ జెండాను దించేశారు. హిందూ, ముస్లింల ఐక్య ప్రభుత్వానికి చిహ్నంగా మహవీర్ నిషాన్, నిషాన్-ఇ-మహమ్మది జెండాలు ఎగరేశారు. ఆగస్టుకల్లా మహవీర్, వలీ షాల సారథ్యంలో పరిపాలన మండలితో పాటు రెండు న్యాయస్థానాలు (క్రిమినల్, సివిల్) కూడా ఏర్పడ్డాయి. దాదాపు ఐదునెలల పాటు హిందు-ముస్లిం ఐక్య సర్కారు నిరాటంకంగా పాలన సాగించింది.