ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ నూతన హంగులతో ముస్తాబవుతోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మూతపడిన ప్రేమసౌధానికి భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఆధ్యర్యంలో మరమ్మతులు జరుగుతున్నాయి. 'మడ్‌ప్యాక్' విధానంలో కొన్నేళ్లుగా పాలరాతి పలకలపై ఉన్న పచ్చని మరలకను తొలగించడమే కాకుండా శిథిలావస్థకు చేరిన గోపురం, మినార్లు, ద్వారాలను బాగు చేయించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. పరిస్థితులు చక్కపడిన తర్వాత వచ్చే సందర్శకులకు తాజమహల్‌ను సరికొత్తగా చూపించేందుకు కరోనా ఆంక్షల సమయాన్ని ఊపయోగించుకుంటోంది ఏఎస్ఐ.
కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వారసత్వ కట్టడాల సందర్శనను ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు నిలిపేసింది భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ). ఇందులో భాగంగా తాజమహల్‌ను కూడా తాత్కాలికంగా మూసివేసింది.
గత 13 నెలల్లో ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని మూసివేయడం ఇది రెండోసారి. మొదటి దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 17న మొదటిసారి సందర్శనను నిలిపివేసింది ఏఎస్ఐ. ఆ తర్వాత కేసులు తగ్గడం వల్ల 2020 సెప్టెంబర్ 21న తిరిగి టూరిస్టులకు అనుమతి ఇచ్చారు.
ఏమిటి ఈ 'మడ్‌ప్యాక్' విధానం?
చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేసేటప్పుడు, వాటి సహజ సౌందర్యం పోకుండా ఉండటానికి భారత పురావస్తు శాఖ ఎక్కువగా 'మడ్‌ప్యాక్' విధానాన్ని ఎంచుకుంటుంది.
మడ్‌ప్యాక్ విధానంలో ముల్తానీ మట్టిని వినియోగిస్తారు. ఆ మట్టి పేస్ట్‌ను రాతిపై పూసి.. నీటితో కడుగుతారు. శుభ్రపరచడంలో రసాయనం ఉపయోగించకపోవడం వల్ల రాయికి ఎలాంటి నష్టం జరగదు. ఫలితంగా ఆ రాయి తన సహజ అందాన్ని తిరిగి పొందుతుంది. ఈ విధానాన్ని తాజమహల్ విషయంలో ఇది వరకు కూడా ప్రయోగించారు.
ప్రధాన మరమ్మతులు ఇవే..
మడ్‌ప్యాక్ విధానంలో తాజ్‌మహల్ కాంప్లెక్స్‌లోని రాయల్ గేట్, గోపురాలు, మినార్లకు మరమ్మతులు చేయనున్నారు. ప్రధానంగా వాటిపై ఉండే పచ్చటి మచ్చలను తొలగించనున్నారు. ప్రధాన గోపురానికి మరిన్ని నగిషీలు చెక్కనున్నారు. ప్రస్తుతం నైరుతిలో ఉండే మినార్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు రూ. 19లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ వసంత్ కుమార్ స్వర్ణకర్ తెలిపారు. మూసివేసిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని.. తాజమహల్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా పర్యటకులకు మరింత అనుభూతిని పంచాలని పురావస్తు అధికారులు భావిస్తున్నారు.
"మరమ్మతులతో తాజ్‌మహల్ సరికొత్త శోభను సంతరించుకుంటుంది. కరోనా పరిస్థితులు చక్కపడిన తర్వాత వచ్చే పర్యటకులు చూసి.. 'వహ్.. తాజ్' అనాల్సిందే. చారిత్రక కట్టడాల పరిరక్షణకు పురావస్తు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం. గతేడాది లాక్డౌన్ సమయంలో కూడా రైల్వేశాఖ.. ట్రాక్‌ల మరమ్మతులను ఇలాగే పూర్తి చేసింది."
-రాజీవ్ సక్సేనా, ఆగ్రా పర్యటక సమాఖ్య ఉపాధ్యక్షుడు
రాయల్ గేట్