AP Professional Forum Roundtable Meeting : చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్టుపై ప్రైవేటు కేసు వేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం తెలిపింది. ఆడిటర్ అరెస్టుపై ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. నూతన కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది. పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే పరిశ్రమలు, పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించింది. ఆడిటర్ అరెస్టుపై చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు.
అరెస్టు దారుణం.. బ్రహ్మయ్య అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ శ్రావణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఏలను చట్టవిరుద్ధంగా అరెస్టు చేయటం దారుణమని వక్తలు మండిపడ్డారు. కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే చిట్ ఫండ్ సంస్థలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు.
డొనేషన్, రిజర్వేషన్ లేని కోర్సు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు. ఎవరో, ఏదో చెప్పారని అప్పటికప్పుడు అరెస్టు చేయడం దుర్మార్గం. ఈ విషయంలో ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ స్పందించాలి.- శ్రీనివాస్, చార్టర్డ్ అకౌంటెంట్
అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనపై బనాయించిన కేసు సరికాదు. పెట్టిన కేసులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సీఏలను చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం దారుణం.- పీవీ మల్లికార్జునరావు, చార్టర్డ్ అకౌంటెంట్
కనీస నిబంధనలు పాటించకుండా.. చార్టర్డ్ అకౌంటెంట్‌ని అరెస్టు చేయడానికి పాటించాల్సిన కనీస నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతమని వక్తలు ప్రశ్నించారు. చార్టర్డ్ అకౌంటెంట్ శ్రావణ్ అరెస్టును ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని కోరారు. శ్రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చట్టప్రకారం ఈ కేసులో 409 సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు స్వతంత్ర సంస్థలు లొంగుతున్నాయన్న భయం ప్రజల్లో బలపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ఇండిపెండెంట్ ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం అప్రజాస్వామికం. రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన ఈ అరెస్టు ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.- జడ శ్రావణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది