TSPSC question paper leakage case టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో మలుపు తిరిగింది. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పత్రం లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ పేపర్ లీకైందని పోలీసుల విచారణలో తేలింది. పరీక్షకు రెండ్రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు. టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా లీకైనట్లు పోలీసులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో 9 మంది అరెస్టు అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ సహా మరో ఏడుగురు అరెస్టు అయ్యారు.
వారి నుంచి పది సెల్‌ఫోన్లు, ట్యాబ్, 3 ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌వో ప్రవీణ్‌కు చెందిన ప్రింటర్, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టు చేయగా.. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా అరెస్టు అయ్యారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష రద్దు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉంది.
ఈనెల 11న టీఎస్‌పీఎస్సీ నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని ఫిర్యాదు వచ్చింది. పేపర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రధాన నిందితుడు. ప్రవీణ్, మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కలిసి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. పాస్‌వర్డ్ హ్యాక్‌చేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. కంప్యూటర్లలోని ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. రేణుక అనే మహిళ ద్వారా ఇద్దరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఇచ్చినందుకు రూ.13.5 లక్షలు తీసుకున్నారు.పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశాం. - పోలీసులు