sitara

ETV Bharat / tv-and-theater

'నీవు దూరమై ఏడాది' - anniversary

'వెన్నెలైనా, చీకటైనా' అంటూ చీకట్లో వెన్నెలను పరిచయం చేసింది శ్రీదేవి. 'వసంత కోకిల'లో పిచ్చి చూపులతో పిచ్చెక్కించి ఆమె 'కథ కల్పన' కాదని తెలిపింది. 'ఇంగ్లీష్ వింగ్లీష్' ​చిత్రంలో కళ్లతో పలికించిన హావభావాలు మన రోజూ చూసే మధ్యతరగతి మహిళలే గుర్తుకుతెస్తాయి.

శ్రీదేవి

By

Published : Feb 24, 2019, 7:29 AM IST

చూడగానే అతిలోక సుందరిలా కనిపించే శ్రీదేవి మైమరిపించే రూపంతో ఆనాటి కుర్రకారు మనస్సు దోచేసింది. నటిగా వెండితెర మీదే కాదు.. భార్యగా, తల్లిగా నిజజీవితంలోనూ ఒదిగిపోయింది. సౌందర్య దేవత నింగికేగి అప్పుడే ఏడాదయిందంటే సగటు అభిమానికి నమ్మబుద్ధి కావట్లేదు.

2018 ఫిబ్రవరి 24న సన్నిహితుల పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి... తిరిగిరాని లోకాలకు చేరింది.

1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో అయ్యప్పన్, రాజేశ్వరి దంపతులకు జన్మించింది శ్రీదేవి. నాలుగేళ్లకే కందాన్ కరుణై అనే తమిళ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. 1970లో 'మా నాన్న నిర్దోషి' తో తెలుగులో ప్రస్థానం ప్రారంభించింది. శ్రీదేవి తండ్రి తమిళం, తల్లేమో తెలుగు. పెళ్లి చేసుకుంది పంజాబీ వ్యక్తిని. ఇలా నాలుగు భాషల్లోనూ పట్టుసాధించింది అందాల తార.

మరువలేని పాత్రల్లో జీవించింది...

'సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా' అంటూ పదహారేళ్లకే ప్రేక్షకుల మది దోచింది శ్రీదేవి. జామురాతిరి వేళ అమాయక చూపులతో యువతను ఒక్క 'క్షణం' కూడా చూపు తిప్పనివ్వలేదు. 'అబ్బని తియ్యని దెబ్బ' అంటూ అందరి హృదయాలపై బలంగా కొట్టింది. 'ప్రియతమా నను పలకరించు హృదయమా' అని కొంటెగా పలకరించింది. 'వెన్నెలైనా, చీకటైనా' అంటూ చీకట్లో వెన్నెలను పరిచయం చేసింది. 'వసంత కోకిల'లో పిచ్చి చూపులతో పిచ్చెక్కించి ఆమె 'కథ కల్పన' కాదని తెలిపింది. 'ఆకలిరాజ్యం'లో మనో వేదనతో మైమరిపించింది. 'ఎల్లువొచ్చి గొదారమ్మా' అంటూ సోగ్గాడి చేతే కాదు... ప్రతి తెలుగువాడి చేత చిందేయించింది. ఇంత అందాన్ని దూరం చేసి 'అమ్మా బ్రహ్మదేవుడా కొంపముంచినావురా' అంటూ సగటు అభిమాని ఆ దేవుడ్నీ తిట్టుకునేలా చేసింది.

రెండో ప్రస్థానం..

1996లో బోనీకపూర్​ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి అనంతరం సినిమాలకు దూరమైంది. 2012లో వచ్చిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం ద్వారా మలి ప్రస్థానం మొదలెట్టింది. నేటితరం ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది శ్రీదేవి. కళ్లతో ఆమె పలికించిన హావభావాలు రోజూ చూసే మధ్యతరగతి కుటుంబాల్ని గుర్తుకుతెస్తాయి. 'మామ్' చిత్రంలో కూతురుపై జరిగే అఘాయిత్యానికి తల్లి పడే ఆవేదన కోపంగా మారితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది.

అవార్డులు దాసోహమయ్యాయి.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలాయాళం భాషాల్లో దాదాపు 300 చిత్రాల్లో నటించింది శ్రీదేవి. అందం, అభినయంతో జాతీయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకుంది. 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 'ఖుధాగవా' చిత్రంలో నటనకు గాను ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆప్ ఆఫ్గనిస్థాన్ పౌరపురస్కారంతో గౌరవించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details