sitara

ETV Bharat / tv-and-theater

వైరల్ అయిందా లేదా! - trend

వైరల్ అయ్యే సంఘటనో, సన్నివేశమో టీజర్లో చూపించి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు అందుకుంటున్నాయి సినిమాలు.

వైరల్

By

Published : Feb 15, 2019, 9:56 PM IST

Updated : Feb 16, 2019, 10:35 AM IST

సినిమా... 150 ఏళ్ల క్రితం ఎవరూ వినని పదం. బహుశా అప్పటివాళ్లకు తెలియదేమో భవిష్యత్తులో ఎక్కువమందిని ప్రభావితం చేసే వినోద సాధనం అవుతుందని. కాలం మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులు తెచ్చుకున్న సినిమా... ప్రేక్షకులను అలరించడంలోనూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో వెళ్తోంది.
ఒకప్పుడు సినిమా థియేటర్లలో ఎన్ని రోజులు ఆడిందన్న దాని బట్టి చిత్రం విజయాన్ని అంచనా వేసేవాళ్లు నిర్మాతలు. తర్వాత... ఎన్ని సెంటర్లలో ఆడిందో ప్రాతిపదికగా తీసుకునేవాళ్లు. అనంతరం ఎంత వసూళ్లు వచ్చాయో లెక్కగట్టేవాళ్లు. ప్రస్తుతం ఈ ట్రెండ్​ కూడా మారిపోతోంది.
ప్రచార చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయితే అన్ని డబ్బులు అన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రచారంతో పాటు సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్రంలో వైరల్ అయ్యే సంఘటనో, సన్నివేశమో టీజర్లో చూపించి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు అందుకుంటున్నారు. అనంతరం సినిమా ఎలా ఉన్నా నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది.
లవర్స్ డే


ఒక్కసారి కన్ను గీటి యువతను కట్టిపడేసింది ప్రియా వారియర్. ఒరు అడార్ లవ్ పేరుతో మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ 2018లో ఎక్కువ మంది చూసిన ట్రైలర్​గా రికార్డుకెక్కింది.
తెలుగులో లవర్స్ డే పేరుతో ప్రేమికుల రోజున విడుదలై మంచి ప్రారంభ వసూళ్లు అందుకుంది.
అర్జున్ ​రెడ్డి

2017లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్​తోనే యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంతరం మంచి విజయాన్ని అందుకుని హీరో విజయ్ దేవరకొండ కెరీర్​లో మరపురాని చిత్రంగా నిలిచింది. సినిమాలో నటనకు ఉత్తమ కథానాయకుడిగా పలు అవార్డులు అందుకున్నాడు విజయ్.
గీతగోవిందం

ఇంకేం ఇంకేం కావాలే... అంటూ ఒక్క పాటతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది ఈ పాట. యువతకు బాగా చేరువైన ఈ గేయానికి గోపి సుందర్ సంగీతం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. 2018లో విడుదలైన గీతగోవిందం పాటలతో పాటు సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది.
కబాలి

సూపర్​స్టార్ రజినీ నటించిన ఈ చిత్రం 2016లో విడుదలైంది. ట్రైలర్​లో కబాలి రా... అంటూ రజినీ పలికే సంభాషణలు అభిమానులను బాగా అలరించాయి. యూట్యూబ్​లో కొన్ని రోజుల్లో 2 కోట్లకు పైగా వీక్షణలతో మెప్పించింది ట్రైలర్. సినిమా అంతగా ఆడకపోయినా రజినీ లుక్, హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మారి2

ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలో రౌడీ బేబీ పాట బాగా పాపులర్ అయింది. అదరగొట్టే స్టెప్పులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ పాట యూట్యూబ్​లో 20 కోట్ల వీక్షణలు దాటి ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. 2015లో వచ్చిన మారి చిత్రానికి సీక్వెల్​గా వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు.
హలో గురు ప్రేమకోసమే

నీ కోసమే.. కాఫీ... ఎలాగుంది.. హాట్​గా ఉంది.. కాఫీ! అనే డైలగ్​లతో యువత మదిలో గిలిగింతలు పెట్టింది హలో గురు ప్రేమకోసమే చిత్ర ట్రైలర్. 2018లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో పాటు డీసెంట్ విజయాన్ని అందుకుంది.
ఒక్క డైలాగ్, పాట, సన్నివేశంతో ప్రాచుర్యం పొంది ప్రేక్షకుల దృష్టిని తమ వైపునకు తిప్పుకుంటున్నాయి ప్రస్తుత సినిమాలు.


Last Updated : Feb 16, 2019, 10:35 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details