దివ్య ఓం ప్రకాశ్ భారతి అంటే చాలామందికి తెలియదు.. బలపం పట్టి భామ బళ్లో అంటూ బొబ్బిలి రాజాతో చిందేసిన దివ్యభారతి అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. 16 ఏళ్లకే తెరంగేట్రం చేసిన ఈ ముంబయి సుందరి దురదృష్టవశాత్తు 19 ఏళ్ల వయసులోనే చనిపోయింది. తెలుగు, హిందీ చిత్ర సీమలో తనదైన ముద్రవేసిన దివ్యభారతి జయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు చూద్దాం!
జననం
ఓమ్ ప్రకాశ్ భారతి, మీటా భారతి దంపతులకు 1974 ఫిబ్రవరి 25న బొంబాయిలో జన్మించింది దివ్యభారతి. 10వ తరగతి పూర్తి చేయకముందే సినిమా ఆఫర్లు రావడంతో చదువు ఆపేసింది. తెలుగులో అగ్ర కథానాయకులందరి సరసన నటించి హిందీలోనూ స్టార్‌డమ్‌ని సంపాదించింది.
తెలుగులోనే ప్రస్థానం మొదలు
విక్టరీ వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసింది దివ్యభారతి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుని స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. చిరంజీవితో కలిసి రౌడీ అల్లుడులో ఆడిపాడి అసెంబ్లీ రౌడీలో మోహన్‌బాబుతో నటించి కనువిందు చేసింది. అనంతరం నందమూరి బాలకృష్ణతో ధర్మక్షేత్రంలో కనిపించి వరుస హిట్లతో దూసుకెళ్లింది. తెలుగులో చివరి చిత్రం తొలి ముద్దులో ప్రశాంత్‌తో జతకట్టింది. ఈ చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడే ఆమె చనిపోవడంతో మిగిలిన భాగం మరో నటితో తెరకెక్కించారు. శ్రీదేవి పోలికలతో కనిపించే ఈ ముంబయి భామ జూనియర్ శ్రీదేవిగా పేరు గడించింది.