sitara

By

Published : Feb 12, 2019, 12:57 PM IST

Updated : Feb 12, 2019, 3:06 PM IST

ETV Bharat / cinema

ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన బాపినీడు

ప్రఖ్యాత తెలుగు సినీ దర్శకనిర్మాత విజయ బాపినీడు కన్నుమూత. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో అనారోగ్యంతో మృతి. ---

చిరంజీవితో బాపినీడు

విజయ బాపినీడు...పేరుకు తగ్గట్టే సినీ ప్రస్థానంలో ఆయన అందించిన భారీ విజయాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు అందించారు. చిరంజీవి, శోభన్​ బాబులను సానపెట్టిన దర్శక దిగ్గజం బాపినీడు.

చదువు...తొలిపరిచయం
1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజీలో డిగ్రీలో బీఏ పూర్తి చేశారు. కొంతకాలం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు.
అనంతరం సినిమా రంగం మీద మక్కువతో రచయితగా మారారు. గుత్తా బాపినీడు పేరుతో రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించారు. ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికల్లో అనేక సంపాదకీయాలు ఆయనవే. తరువాత దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు.
తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయి మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్​ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి హీరోలతో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించారు. 1998లో ‘కొడుకులు’ తరవాత ఏ సినిమానూ నిర్మించలేదు. ఈ చివరి సినిమాను ఆయన కుమార్తెలే నిర్మించారు.

కృష్ణగారడి

సినిమా కెరీర్​..
ఆయన తీసిన 22 సినిమాల్లో గ్యాంగ్‌లీడర్‌, బిగ్‌బాస్‌, మగధీరుడు వంటి సినిమాలు తెలుగు చిత్రపరిశ్రమకు మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలో డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకూ పెళ్ళాం కావాలి(1987), ఖైదీ నెంబర్​ 786 (1988), దొంగకోళ్ళు(1988), మహారాజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్(1991), బిగ్ బాస్(1995), కొడుకులు(1998), ఫ్యామిలీ(1994) చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది(1976) అనే చిత్రం చేశారు.

ప్రత్యేక కథనం

ఆయన చెక్కిన శిష్యులు..
రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే.

'చిరంజీవి' స్థాపకుడు...
శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించారు. స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధంతో ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్‌నూ నడిపారు బాపినీడు.

తీరని కోరిక...
ఇటీవల చిరంజీవి పునరాగమనం తరువాత ఓ సినీవేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరు సినిమాకు దర్శకత్వం చేయాలనుందని అన్నారు. ఆ కోరిక తీరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మెగాస్టార్​గా ఎదగటంలో కీలక పాత్ర పోషించిన విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

గ్యాంగ్ లీడర్

అంత్యక్రియలు భాగ్యనగరంలో...
విజయబాపినీడు హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం 8.40 గంటలకు కన్నుమూశారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె రావాల్సి ఉంది. 14వ తేదీన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Last Updated : Feb 12, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details