sitara

ETV Bharat / cinema

ట్రెండ్ మారినా... 'లవ్' బ్రాండ్ మారదు - కాలం

కాలం మారినా కాదల్​ గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సిందే. కొన్నిచోట్ల తప్పులు జరిగినా.. ప్యార్​ అనే బార్​లో లవర్ అనే మత్తుని సేవించి కిక్ ఎక్కించకుకోవాల్సిందే. ప్రేమలో పడాల్సిందే.

లవ్' బ్రాండ్ మారదు

By

Published : Feb 14, 2019, 11:59 PM IST

ప్రేమ... కాలం మారుతున్న కొద్ది తన పంథాను మార్చుకుంటూనే ఉంది. మూగ సైగల నుంచి లివింగ్​ రిలేషన్​షిప్స్ వరకు... ప్రేమలేఖల నుంచి వీడియో కాలింగ్ వరకు... ప్రేమను త్యాగం చేయడం నుంచి ప్రేమించే వారిని చంపే వరకు వచ్చింది. సాంకేతికంగా ఎంతో వృద్ధి సాధించిన తెలుగు సినిమా.. ప్రేమ విషయంలో ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం!
1950లో...

ఆ కాలంలో ప్రేమికులు ఇప్పటిలా బయటకు రావడం కుదరదు. ఒకవేళ వచ్చినా పొడిపొడి మాటలతోనే కాలం వెల్లబుచ్చి జారుకుంటారు. కళ్లతోనే మాట్లాడుకునే వాళ్లు, ఆరాధించుకునే వాళ్లు.. తల్లిదండ్రులు అర్థం చేసుకుని అంగీకరిస్తేనే పెళ్లి. లేకపోతే గుండె రాయి చేసుకుని మర్చిపోతారు. కానీ కొన్నిసార్లు ఈ మౌన ప్రేమలు మనసుని ఎంతగానో భగ్నం చేస్తాయి. (పల్లెటూరు)
1960
అప్పుడప్పుడే పేమికుల మధ్య.. మౌనం స్థానంలో మాటలు చేరాయి. చొరవ పెరిగి బయట కలుసుకోవడం వాళ్ల ప్రేమలను పెద్దవాళ్లకు చెప్పడం పెరిగింది. తెలుగు సినిమాల్లో పెద్దలకు చెప్పి ప్రేమవివాహాలు చేసుకోవడం ఈ కాలం నుంచే ప్రారంభమయ్యాయి. (మూగనోము)
1970
మౌనం తర్వాత మాటలు అనంతరం ప్రేమలేఖలతో ప్రేమ పంథా మారింది. ముద్దు మురిపాలు, గొడవలు, సర్దుబాట్లు లాంటి వాటిని చిత్రాల్లో చూపించారు. కళాశాలలో ప్రేమను వ్యక్తీకరించడం ఈ కాలంలో ఎక్కువ చిత్రాల్లో కనిపించింది. (సావాసగాళ్లు)
1980
ప్రేమ... ఉత్తరాల నుంచి ఫోన్లకు మారింది ఈ కాలంలోనే... బయట విరివిగా కలవడం, పెద్దలను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే సన్నివేశాలను చిత్రీకరించారు.. మాస్ ప్రేక్షకుల మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రేమలో ఘాటు పెంచారు. అదర చుంబానాల(లిప్ కిస్) ట్రెండ్ ఈ దశకంలోనే ప్రారంభమైంది. (ఖైదీ)
1990
ఫోన్ల నుంచి ప్రేమ అంతర్జాలానికి చేరిందే ఈ దశాబ్దంలోనే. ఆన్​లైన్​ చాటింగ్​లు, అప్పుడప్పడే వస్తున్న పేజర్లు, సెల్యూలర్ ఫోన్లతో మాట్లాడుకునేవాళ్లు ప్రేమికులు. హృదయాన్ని హత్తుకునే గీతాలతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుందీ దశకం. సాంకేతికత సాయంతో ప్రేమను పలు రకాలుగా వ్యక్తపరిచారు దర్శకులు.
2000
కొత్తగా వచ్చిన మిలీనియంలో ముక్కుసూటిగా వ్యవహరించే అబ్బాయిలనే ఇష్టపడ్డారు అమ్మాయిలు. కవితాత్మకమైన మాటలు, సంభాషణలకు కాలం చెల్లింది. ప్రేమను విభిన్నంగా వ్యక్తపరుస్తూ... వన్​సైడ్ లవ్​లో కూడా సంతోషంగా ఉండవచ్చంటూ భిన్నంగా చూపించారు.
2010
ప్రేమను వ్యక్తీకరించడంలో మరో మెట్టెక్కింది ఈ దశకంలోనే. ఘాటైన అదర చుంబనాలతో(లిప్ కిస్) వెండితెరను అదరగొట్టారు. స్మార్ట్​ఫోన్​లలో చాటింగ్​లతో ప్రేమికుల మధ్య దూరం తగ్గింది. డిజిటల్ యుగంలో ప్రతి విషయాన్ని అంతర్జాలంలో పెడుతూ ట్రెండ్​కు తగ్గట్లుగా మారింది యువత. సామాజిక మాధ్యమాలు డేటింగ్ యాప్​లతో ప్రేమికులు ఖండాంతరాలు దాటారు.
2020
ఐదో తరం(5-జి) సాంకేతికత రాబోతున్న తరుణంలో కొందరిని చూస్తుంటే ప్రేమ మరింత బహిర్గతమవుతుందేమోనపిస్తుంది.! ఇప్పటికే అంతర్జాలంలోనే సమస్తం జరుగుతున్నాయి. లివింగ్ రిలేషన్​షిప్​లతో ఒక్కరోజులో పెళ్లిచేసుకుని మరుసటి రోజే విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది! ఇందుకు సాక్ష్యం ఇటీవలే పెళ్లి చేసుకుని మూడు నిమిషాల్లో విడాకులు తీసుకుంది ఓ యువతి. ప్రేమలో విచ్చలవిడితనం, పార్కులు, సినిమా థియేటర్లు, ఇంటర్​నెట్ సెంటర్లు దాటి మెట్రో స్టేషన్ల వరకు చేరింది. ఇలాంటి విషయాలకు మన చిత్రాలు మినహాయింపేమీ కాదు!
కాలం మారినా కాదల్​ గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సిందే... కొన్నిచోట్ల తప్పులు జరిగినా.. ప్యార్​ అనే బార్​లో లవర్ అనే మత్తుని సేవించి కిక్ ఎక్కించకుకోవాల్సిందే... ప్రేమించి అందరిని మెప్పించాల్సిందే. మొత్తానికి ట్రెండ్ మారినా లవ్ బ్రాండ్ మాత్రం మారదు!

ABOUT THE AUTHOR

...view details