sitara

ETV Bharat / cinema

మార్పుతోనే విజయం

బాలీవుడ్ ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు... ఇండస్ట్రీకి కొత్త కథలు తెచ్చిపెడుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

By

Published : Feb 17, 2019, 4:56 PM IST

అనిల్ కపూర్, అజయ్ దేవ్​గన్

"ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. కొత్త రకం సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే దర్శకులు విభిన్న కథలతో రావాల్సిన అవసరముంది" అని బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అజయ్ దేవ్​గన్ అన్నారు. ప్రస్తుతం 'టోటల్ ధమాల్' సినిమా ప్రమోషన్స్​లో ఉన్న వీరు వివిధ అంశాలపై మాట్లాడారు.

"1971లో నేను సినీ రంగ ప్రవేశం చేశా. అప్పటికీ, ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది. ప్రేక్షకులు విభిన్న పాత్రల్లో నన్ను చూడటానికి ఇష్టపడుతున్నారు. అన్ని రకాల పాత్రలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారతాయి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు ఎంపిక చేసుకోవాలి. అదే విజయసూత్రం. 'టోటల్ ధమాల్' చిత్రంలో గుజరాతీ పాత్రలో కనిపిస్తాను. ఆ యాసలో మాట్లాడటానికి చాలా శ్రమించా. చాలా కాలం తర్వాత మాధురి దీక్షిత్​తో కలిసి నటించడం ఆనందంగా ఉంది".
--అనిల్ కపూర్, బాలీవుడ్ నటుడు

ప్రస్తుతం అనిల్ కపూర్ అనీష్ బజ్మీ దర్శకత్వంలో 'పాగల్ పంతి'తో పాటు కరణ్ జోహర్ నిర్మాణంలో 'తక్త్' సినిమా ఒప్పుకున్నారు. అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్​తో ఒలంపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రాపై బయోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

"కథ ప్రధానంగా నడిచే సినిమాలు బాలీవుడ్​కి కొత్తకాదు. మంచి కథనంతో పాటు వాణిజ్య అంశాలతో కూడిన చిత్రాలు వస్తున్నాయి. ప్రేక్షకులూ బాగా ఆదరిస్తున్నారు. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో నేను చేసిన 'జక్మ్' అందుకు నిదర్శనం. ప్రేక్షకులతో పాటు మనమూ మారాలి. వారి అభిరుచులకు తగ్గట్టు చిత్రాలు తీయాలి. ప్రస్తుతం ప్రేక్షకులు మంచి సినిమాలనే చూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలు బాక్సీఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కథాలోపం. ఒక చిత్రానికి సంబంధించి ఖర్చుపై శ్రద్ధ వహించాలి. కథానాయకులు పారితోషికం కంటే సినిమా లాభాల్లో వాటా తీసుకోవడం మంచిది"
--అజయ్ దేవ్​గన్, బాలీవుడ్ నటుడు
ప్రస్తుతం అజయ్ దేవ్​గన్ టబుతో కలిసి 'దే దే ప్యార్ దే', 'తానాజీ', నీరజ్ పాండేతో కలిసి 'చాణక్య' చిత్రాలు చేస్తున్నారు. ఫుట్​బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details