సర్పంచుల ప్రోటోకాల్‌ను కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది: చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 8:20 PM IST
Chandrababu Attend to Sarpanches Meeting: సర్పంచుల ప్రోటోకాల్‌ను కాపాడే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సర్పంచులకు గౌరవ వేతనం అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. మళ్లీ అధికారం చేపట్టాక మరోసారి గౌరవవేతనం పెంచుతామని హామీ ఇచ్చారు.
CM Jagan Robbery in Panchayat Funds: రాష్ట్ర సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైంధవుడిలా అధికారాలను, పంచాయతీల నిధులను హరించి వేస్తున్నారని సర్పంచులు మండిపడ్డారు. పంచాయతీరాజ్ చట్టం ఏం సూచిస్తుందో అందులో ఉన్న విధులు, హక్కులను సైతం జగన్ హరించి వేశారన్నారు. నిధుల కొరతతో గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొందని సర్పంచులు వాపోయారు. సొంత నిధులను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని సర్పంచులు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో త్రాగేందుకు కనీసం నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి తన విధానాలతో పంచాయతీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు.