Illegal Land Mining చెరువు కబ్జాలో దోబూచులాట.. వాళ్లేస్తారు.. వీళ్లు తీస్తారు.! - తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి
Illegal Land Mining in Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పట్టణానికి అనుకొని ఉన్న భూములన్ని యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. చెన్నై- నాయుడుపేట రహదారులను కలుపుతూ మినీ బైపాస్ అభివృద్ధి కావడంతో పాటు దక్షిణ కైలాస్నగర్లో ఇళ్ల నిర్మాణాలు జోరందుకోవడంతో అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
ఇక్కడున్న భూ బకాసురులు ఓ పథకం ప్రకారం రాత్రికి రాత్రి గుంజలు నాటడం, మళ్లీ నామమాత్రంగా నిర్మాణాలకు సిద్ధం చేయడం సర్వ సాధారణంగా మారింది. దీనిపై విమర్శలు రావడం, అధికారులు వెళ్లి తాత్కాలికంగా వాటిని తొలగించడం, మళ్లీ వారం 10 రోజుల తర్వాత పక్క కబ్జాకు యత్నాలు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం చెరువున అనుకొని చాలా కట్టడాలు ఏర్పాటు అవుతున్నాయి. రియాల్టర్ల మాటలు నమ్మి కొందరు అమాయకులు చెరువు స్థలాలను కొనుగోలు చేసి నష్టపోతున్నారు.
చెన్నై-నాయుడుపేట రహదారికి ఆనుకుని రూ. కోటికి పైగా విలువైన మరో స్థలాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయి. రాత్రికి రాత్రి జేసీబీతో స్థలాన్ని చదును చేశారు. కబ్జా వ్యవహారం గుట్టు రట్టు కావడంతో ప్రస్తుతం పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై తొట్టంబేడు తహసీల్దార్ మాట్లాడుతూ కబ్జాలను పూర్తిగా నిలువరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.