CPM on CM Jagan Coming to Visakha ఎన్నికల వేళ విశాఖ అభివృద్ది గుర్తుకొచ్చిందా..! ఇన్నేళ్లగా అమరావతి ప్రాంతాన్ని ఏం చేశారు..: సీపీఎం - CM Jagan Coming to Visakha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 6:45 PM IST
CPM Leaders Criticised on CM Jagan Coming to Visakha: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగున్నర గడిచినా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి అభివృద్ధి చేస్తామని అనటం విడ్డూరంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రతినిధులను నిలదీయటానికి సీపీఎం చేపట్టిన ప్రజా పోరుబాట కార్యక్రమం ముగింపు సభను విజయవాడలో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. మరీ అలా అయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ఎందుకు అభివృద్ధి జరగలేదని నిలదీశారు.
సీపీఎం అధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో అనేక ప్రజా సమస్యలను గుర్తించినట్లు సీపీఎం నేతలు వివరించారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వకుండా పతనావస్థకు తీసుకువచ్చారని శ్రీనివాసరావు మండిపడ్డారు. నవంబరు 15న విజయవాడలో ప్రజా సమస్యలపై సభ నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు విషయంలో టీడీపీ ఆందోళన న్యాయమేనని.. రాజకీయ నేత జైల్లో ఉంటే ఆయన బాగోగుల బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద కక్ష సాధించటం ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ.. కేసులు పెడుతున్నారని సీపీఎం నేత సీహెచ్ బాబురావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో లేదని విమర్శలు చేశారు. వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, ఇంకా నిత్యవసర ధరల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.