రాష్ట్రం అప్పులపై సీఎం జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 5:21 PM IST
CPI State Secretary Ramakrishna Criticized CM Jagan :ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరులో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. కేవలం రుణాలకు సంబంధించిన వడ్డీ కింద ఏటా రూ.60 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని సాక్షాత్తు రిజర్వు బ్యాంకు తప్పు పట్టిందని తెలిపారు. రాష్ట్రంలో జగన్ పాలన అధ్వానం, అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు.
న్యాయ సమ్మతమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత 12 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ నియంతృత పోకడలను అనుసరిస్తున్నారని విమర్శించారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం చెల్లించే దానికి అదనంగా రూ.1000 ఇస్తానని చెప్పిన జగన్ నేడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు నెలకు రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా జగన్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.