Suspect Death: రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి తనయుడు విష్ణు సాయిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప రైల్వే స్టేషన్ సమీపంలో సాయిరెడ్డి మృతదేహం లభ్యమైంది. కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లికి చెందిన విష్ణు సాయిరెడ్డి లండన్‌లో ఎమ్మెస్ చదువుతున్నాడు. ఇటీవల లండన్ నుంచి కడపకు తిరిగి వచ్చిన సాయిరెడ్డి.. తిరిగి లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లలేదు.
ఇవాళ కడప సమీపంలోని ఫాతిమా కళాశాల వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు అటవీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ లక్ష్మి కుమారుడని రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్యా ? లేక ఆత్మహత్యా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.