ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 16, 2020, 10:38 PM IST

ETV Bharat / state

రిజర్వ్ ఫారెస్టు భూవివాదం...వివరణ కోరిన ఎన్జీటీ​

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వంద ఎకరాల అటవీ భూమి ఆక్రమణలపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వంద ఎకరాలను వైకాపా నాయకులు ఆక్రమించారని తెదేపా నేతలు ఆరోపణలు చేస్తుండగా... అదంతా పట్టా భూమి అని వైకాపా కొట్టి పారేస్తోంది. వంద ఎకరాల ఆక్రమణల వ్యవహారం జాతీయ హరిత ట్రెబ్యునల్ కోర్టుకు చేరగా... రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ భూమి ఆక్రమణకు గురైందా లేదా సమగ్ర వివరాలు సమర్పించాలని ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ngt
ngt

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో సర్వేనంబరు 506-బి, 507లో 104 ఎకరాల రిజర్వ్ అటవీ భూమి ఆక్రమణకు గురైందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. గత నెలలో మైదుకూరు తెదేపా ఇన్​ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్...ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. భూమి చుట్టూ కంచె వేయడంతో పాటు మామిడి మొక్కలు నాటడం, బోర్లు వేయడం, డ్రిప్ ఏర్పాటు చేయడం చేశారు. ఇదంతా వైకాపా నాయకుల పనేనని పుట్టా ఆరోపించారు. వైకాపా నాయకులు ఈ ఆరోపణలతో విభేదింస్తున్నారు. పట్టా భూమిని కొనుగోలు చేశామని వైకాపా నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వ మీ భూమి వెబ్​సైట్​లో 104 ఎకరాల భూమి రిజర్వు ఫారెస్టుగా కనిపిస్తోంది. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్... జాతీయ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్​లో అన్ని ఆధారాలతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను పొందుపరుస్తూ పిటిషన్ వేశారు.

పిటిషన్​పై వాదనలు విన్న న్యాయమూర్తి... ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్​కు నోటీసులు జారీచేశారు. ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న 104 ఎకరాల భూమి అటవీ సంరక్షణలోనే ఉందా... లేదా ఎవరైనా ఆక్రమించారా అనే వివరాలను సమగ్రంగా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 23వ తేదీ లోగా సమగ్ర వివరాలు పొందుపరచాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రతులు, వివరాలను పుట్టా సుధాకర్ యాదవ్ ఇవాళ కడపలో వెల్లడించారు. ప్రజాసంబంధమైన మంచి పనులకు భూమి అవసరమైతే అటవీశాఖ అనుమతులు నిరాకరిస్తుంది. అలాంటిది దాదాపు వంద ఎకరాలు పైగానే భూమిలో నాలుగు నెలల నుంచి కంచె వేసి, మామిడి మొక్కలు సాగు చేస్తూ ఉంటే అధికారులు కళ్లు మూసుకున్నారా అని తెదేపా కడప పార్లమెంటు ఇన్​ఛార్జి లింగారెడ్డి ప్రశ్నించారు. వైకాపా నాయకులు స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

అటవీ భూమి ఆక్రమణలపై సమగ్ర వివరాలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కంచె వేసిన భూమిని పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆరు వారాల సమయం ఉండటంతో ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భూమి ఆక్రమణలపై అధికారులపై వేటు పడే వీలుందని తెదేపా నేతలు అంటున్నారు.

ఇదీ చదవండి :ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం

ABOUT THE AUTHOR

...view details