నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి రికార్డుస్థాయిలో నీరు చేరింది. మొన్నటి వరకూ గరిష్ఠస్థాయిలో నీటి ప్రవాహం ఉండటం వల్ల దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వల్ల పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహించింది. నది మీద ఉన్న వంతెనల మీదుగా నీరు ప్రవహించడం వల్ల... ముందు జాగ్రత్తగా అధికారులు సోమశిల గేట్లు మూసేశారు. దీని వల్ల జలాశయం నుంచి వెనక్కి మళ్లిన జలాలు... కడప జిల్లాలోని ముంపు గ్రామాలను నీటముంచాయి.
కడప జిల్లా అట్లూరు, గోకవరం మండలాల్లోని... బుడ్డిచర్ల, సూరేపల్లి, వరికుంట, వాండ్లపల్లి, ఆకుతోట తదితర గ్రామాలు నీటమునిగాయి. ఇళ్లు, భూములు కోల్పోయి అక్కడివారు నిరాశ్రయులయ్యారు. చుట్టూనీరు ఉండటం వల్ల రాకపోకలు స్తంభించాయి. పాములు, తేళ్లు వంటి విషప్రాణులు... ఇళ్లలోకి, పాఠశాలలోకి రావడంతో భయంతో వణికిపోతున్నారు. తమకు ఇస్తామన్న పరిహారం చెల్లించి... న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అనేకసార్లు తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందారు.