టీడీపీ నేతకు హారతిచ్చి, బొట్టు పెట్టిన వైసీపీ నాయకురాలు.. ఆశ్చర్యపోయిన కార్యకర్తలు YCP leader welcomes TDP leaders: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇదేం ఖర్మరా రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. తణుకు పట్టణంలోని 26, 30 వార్డులలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులు దృష్టికి తెచ్చారు.
రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్ర లో బుగ్గలు నిమురుతూ నెత్తిన చేతులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. హామీలన్నింటినీ తుంగలో తొక్కడమే కాక మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి చివరకు మద్యం డబ్బులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాధాకృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
హారతిచ్చి స్వాగతించిన వైసీపీ నాయకురాలు..ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ముందుకు వచ్చి ఇంటింటికి తిరిగినప్పుడు.. అక్కడక్కడ మహిళలు హారతి ఇవ్వడం తెలిసిందే. ఏ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు వస్తే.. ఆ పార్టీకి చెందిన అభిమానులు కార్యకర్తల కుటుంబాలకు చెందిన మహిళలు సర్వసాధారణం. అయితే ఈ కార్యక్రమంలో విచిత్రమైన సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇదేం కర్మరా రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 26, 30 వార్డుల్లో ఇంటింటికి వెళ్లారు. ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే వార్డులో ఉన్న వైసీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి ఇంటికి వెళ్లారు.
ఆమె రాధాకృష్ణకు హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి స్వాగతించారు. ఆమె స్వాగతానికి రాధాకృష్ణతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. వావిలాల సరళాదేవి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌కు.. చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత కూడా టీడీపీ నాయకులకు ఘన స్వాగతం పలకటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: