ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలజీవన్‌ మిషన్‌ పనుల్లో నాణ్యతాలోపం.. నాసిరకంగా నల్లాలు - vizianagaram latest news

ఇంటింటా కుళాయి పథకంలో లోపాలు అప్పుడే బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటు చేసిన కుళాయిలు, ట్యాంకుల నిర్మాణంలో నాణ్యత లోపం బయటపడుతోంది. ట్యాపులు ఊడిపోతున్నాయి. కుళాయిల నుంచి నీరు లీకవుతోంది. వాటి వద్ద దిమ్మెలు ఉండటం లేదు. భూమి లోపల ఉండాల్సిన ప్రధాన పైపులు బయటకు కనిపిస్తున్నాయి.

water leakage at bobbili
బొబ్బిలిలో నాసిరకంగా నల్లాలు

By

Published : May 2, 2021, 12:07 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలిలో.. ఇంటింటా కుళాయి పథకంలో లోపాలు అప్పుడే బయటపడుతున్నాయి. కుళాయిల ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతా లోపం బయట పడుతోంది. వేసవికి ముందే ప్రజల గొంతు తడపాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పథకం తీరుతెన్నులపై ‘న్యూస్‌టుడే’ జరిపిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది జల జీవన్‌ మిషన్‌ పథకం ఉద్దేశం. దీనిలో భాగంగా జిల్లాలో 4,32,000 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇంత వరకు 1,43,000 వేశారు. ఈ పథకానికి రూ.291 కోట్లు కేటాయించారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని యంత్రాంగం చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ముందుకు సాగడం లేదు.

ప్రమాదాలకు ఆస్కారం

ప్రతి మండలంలో పనుల్లో నాణ్యత లోపం కనిపిస్తుంది. ట్యాపులు ఊడిపోతున్నాయి. కుళాయిల నుంచి నీరు లీకవుతోంది. వాటి వద్ద దిమ్మెలు ఉండటం లేదు. భూమి లోపల ఉండాల్సిన ప్రధాన పైపులు బయటకు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో పాత సౌరశక్తి ట్యాంకులకు పైపులైన్లు అనుసంధానం చేశారు. పాత బోర్ల పనితీరు చూడకుండానే వాటి పరిధిలో ట్యాపులను అమర్చారు. కొయ్యికొండవలస, నిమ్మలపాడులో బోర్ల నుంచి రిజర్వాయర్‌కు వెళ్లే విద్యుత్తు లైన్లకు పైపులు వేయకుండా బయటే ఉంచేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

డబ్బులు ఇచ్చినా వేగం లేదు

పనులు చేపట్టే గుత్తేదారులకు ముందుగానే కొంత నగదు చెల్లించినా పనుల్లో వేగం లేదు. ఇప్పటి వరకు చేసిన పనుల్లోనూ నాణ్యత లేదన్న విమర్శలు వస్తున్నాయి. బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లో జరుగుతున్న పనులకు ఇద్దరు గుత్తేదార్ల పేరుపై సుమారు రూ.30 లక్షల మేర అడ్వాన్సు చెల్లించినా ఆ మేరకు పనులు జరగలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బాడంగి, తెర్లాంలో పనులు ముందుకు కదలడంలేదు. బొబ్బిలి, రామభద్రపురం మండలాల్లోనూ ప్రగతి అంతంతమాత్రమే.

పనుల తీరు ఇలా..

బొబ్బిలి మండలం నిమ్మలపాడులో ఇంటింటికీ కుళాయిలు అమర్చారు కానీ ట్యాంకు నిర్మించలేదు. పాత ట్యాంకుకు అనుసంధానం చేశారు. ఇందుకు రూ.1.50 లక్షలు కేటాయించారు.

కొయికొండవలసలో

కొయ్యికొండవలసలో లీకవుతున్న ట్యాంకు

కొయికొండవలసలో రూ.3 లక్షల వ్యయంతో ట్యాంకు నిర్మించి పైపులు అమర్చారు. ట్యాంకు లీకై దిగువ స్లాబ్‌ ఒరిగిపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి.

సీసాడవలసలో

సీసాడవలసలో కుళాయిలు ఏర్పాటు చేసి పాత సోలార్‌ ట్యాంకుకు అనుసంధానం చేశారు. పాతబోరుతో పంపింగ్‌ చేస్తున్నారు. ట్యాపుల నుంచి నీరు లీకవడంతో ప్లాస్టిక్‌ సంచులు కట్టారు. నీరు సరఫరా కావడం లేదని గిరిజనులు వాపోతున్నారు.

సిమిడి గుడ్డివలసలో

సిమిడి గుడ్డివలసలో పనులకు రూ.5 లక్షలు కేటాయించారు. పాతట్యాంకుకు అనుసంధానం చేశారు. కుళాయిలకు నీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి మండలం వెలగవలసలో రిజర్వాయరు నిర్మించకుండానే ట్యాపులు అమర్చారు.

ఎరకన్నదొరవలస, విజయపురిలో రూ.ఐదు లక్షలు కేటాయించగా కొన్ని వీధులకు పూర్తిస్థాయిలో కుళాయిలు వేయలేదు. గతంలో నిర్మించిన ట్యాంకుకు వాటిని అమర్చారు. కొంతమంది మరుగుదొడ్లకు ట్యాపులు అమర్చుకున్నారు.

బాడంగి మండలంలో

బాడంగి మండలంలోని ముగడ, గొల్లాది గ్రామాలకు సుమారు రూ.10 లక్షల నిధులు కేటాయించినా పనులు ప్రారంభించలేదు. వేగావతిలో బోర్లను తవ్వి పైపులైన్ల పనులు చేపట్టారు. వీటిని మధ్యలోనే ఆపేశారు. కుళాయిలు అమర్చలేదు.

బాడంగి మండలం భీమవరం, లక్ష్మీపురంలో పనులు పూర్తవగా కుళాయిల నుంచి నీరు లీకవుతోంది. రామచంద్రపురంలో నాసిరకం పైపులు అమర్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

తెర్లాం మండలంలో

జోగిందెరవలసలో సక్రమంగా పనిచేయని సోలార్‌ ట్యాంకర్

తెర్లాం మండలంలోని అంటివలస, కుమ్మరిపేట, జనార్దనవలస, పాములవలస ప్రాంతాలకు నిధులు కేటాయించినా పనులు పూర్తి చేయలేదు.

రామభద్రపురం మండలంలోని జోగెందరవలస, మోసూరువలసలో పాత సోలార్‌ పథకాలకు ట్యాపులు అమర్చారు.ఎండ ఉంటేనే తాగునీరు. లేకపోతే రాని పరిస్థితి.

నాణ్యత లేకుంటే బిల్లులు నిలిపేస్తాం

పనుల్లో నాణ్యత లోపం మా దృష్టికి రాలేదు. అలా ఎక్కడైనా ఉంటే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే గుత్తేదార్లకు బిల్లులు నిలిపివేస్తాం. సామగ్రి కొనుగోలు చేశాక కొంత బిల్లు గుత్తేదార్లకు ఇస్తాం. పైపులు, ట్యాపులు అంచనాల్లో పేర్కొన్న విధంగా ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే కొనుగోలు చేస్తున్నాం.

- పీఎంకే రెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌, బొబ్బిలి.

బొబ్బిలి నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ

  • 5 లక్షల లోపు పనుల సంఖ్య: 103
  • వీటి అంచనా మొత్తం: రూ.5.15 కోట్లు
  • 5 లక్షలు దాటిన పనుల సంఖ్య: 33
  • వీటి అంచనా విలువ: రూ.3.95 కోట్లు
  • పూర్తయిన పనుల శాతం: 35

బొబ్బిలి మండలం కొయ్యికొండవలసలో సుమారు రూ.3 లక్షలతో ఇంటింటికీ కుళాయి పనులు చేపట్టారు. దీనిలో భాగంగా నిర్మించిన ట్యాంకు లీకవుతోంది. దిగువ శ్లాబ్‌ పెచ్చులూడే స్థితికి చేరుకుంది.

రామభద్రపురం మండలం జోగిందెరవలసలో సక్రమంగా పనిచేయని సోలార్‌ ట్యాంకరు, దీనికే కుళాయిలు అనుసంధానం చేశారు.


ఇదీ చదవండి:

ఆ పిచ్చుకలు, చిలకలే ఆయన నేస్తాలు..

ABOUT THE AUTHOR

...view details