What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: 'ఎన్నికల ముందు ఒక మాట-అధికారం చేపట్టాక మరో మాట' మాట్లాడుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అని నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..? అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు అంటూ పాదయాత్రలు, లేఖలు పేరిట హడావిడి చేసిన ఆ వైఎస్సార్సీపీ నాయకులు ఎక్కడికి పోయారు..? అంటూ ధ్వజమెత్తుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్, వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఉత్తరాంధ్ర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించినందుకు.. ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్, తమిళనాడులోని స్టెయిన్‌లెస్ స్టీల్, పశ్చిమ బెంగాల్‌లోని ఎల్లాయ్ స్టీల్ కర్మాగారాల ప్రైవేటికరణ కేంద్రం ఆపలేదా..? అని సీఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
Vishaka Steel Plant Workers Criticize YCP Govt: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న 'విశాఖ ఉక్కు' కష్టాల్లో ఉంటే.. ‘రుషికొండ’లో రాజభవంతి ఏర్పాటులో నిమగ్నమైన ముఖ్యమంత్రి జగన్ తీరు.. స్టీల్ ప్లాంటు ఊపిరి తీస్తోంది. ఇరవై అయిదు మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్.. ఉక్కు విషయంలో కేంద్రంపై ఒక్కసారైనా ఒత్తిడి తీసుకురాలేదు. ప్రతి పార్లమెంట్ సమావేశంలోనూ కంటితుడుపుగా ఎవరో ఒకరు స్టీల్ ప్లాంటు గురించి ప్రశ్న వేస్తే ప్లాంటును అమ్మేస్తాం, ఇందులో వెనకడుగు లేదు అనే రీతిలో కేంద్ర మంత్రులు సమాధానమివ్వడం అలవాటుగా జరిగిపోతుంది. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి సొంత అవసరాలు, మొహమాటాలు అడ్డొచ్చాయనుకుంటే.. కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం కూడా ఎందుకు చేయడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.
Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై నోరువిప్పని సీఎం జగన్.. కేంద్ర పెద్దల వద్ద మౌనంగా వైసీపీ ఎంపీలు
Chhattisgarh Nagarnar Steel Plant: కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలోని N.M.D.C. పదేళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌లో జగదల్‌పుర్ దగ్గర నగర్నార్‌లో 3 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 400 మంది ఉద్యోగులున్నారు. దీన్ని కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేసి.. బిడ్లు ఆహ్వానించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15 రోజుల క్రితం.. అక్కడ మూడు జిల్లాల పరిధిలో బంద్ గట్టిగానే చేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 11 ఎంపీ స్థానాలున్న రాష్ట్రంలో.. బీజేపీ తొమ్మిది సీట్లు గెల్చుకుంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో.. ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకతను గమనించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనలో నగర్నార్ స్టీల్ ప్లాంటు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని, దీనిపై హక్కులు గిరిజనులకే ఉన్నాయంటూ ప్రకటించారు.
Tamil Nadu, West Bengal Steel Plants: తమిళనాడులో సేలం స్టెయిన్‌లెస్ స్టీల్ కర్మాగారాన్ని అమ్మేయాలని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో తమిళనాడులోని పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఫలితంగా ఇప్పటి వరకు సేలం కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎల్లాయ్ స్టీల్ కర్మాగారాన్ని అమ్మేస్తాం లేదా మూసేస్తామని కేంద్ర ఉక్కు శాఖ ప్రకటిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల సమయంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని.. కేంద్ర పెద్దలు ప్రకటించారు. ఇటీవల మోక్షగుండం విశ్వేశ్వరయ్య భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని మూసివేస్తామని సెయిల్ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనిని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయం పెండింగ్‌లో పడింది.