ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారు!
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహజవనరులు దోపిడీకి గురవుతున్నాయి. మైనింగ్ అక్రమార్కులు ఖనిజాలను కరిగించేస్తున్నారు. గ్రావెల్ దందా నడుపుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహజవనరులు దోపిడీకి గురవుతున్నాయి. మైనింగ్ అక్రమార్కులు ఖనిజాలను కరిగించేస్తున్నారు. గ్రావెల్ దందా నడుపుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు. విజయనగరం గనుల శాఖ ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయ ఏడీ ప్రతాప్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై వరస దాడులు చేయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్వారీల నిర్వహణ, లీజు అమలు, ఖనిజాల రవాణాలో అడుగడుగునా అక్రమాలు బయటపడ్డాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అక్రమ మైనింగ్ నిర్వాహకులపై రూ.254 కోట్ల అపరాధ రుసుం విధించారు. రహదారులపై తనిఖీలతో ఖనిజ అక్రమ రవాణాదారుల నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 7.28 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా గ్రానైట్‌కు, విజయనగరం మాంగనీసుకు, విశాఖపట్నం రోడ్డు మెటల్, లేటరైట్ గనులకు ప్రసిద్ధి. ఈ గనులన్నింటినీ అధికారిక అనుమతుల ముసుగులోనే అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. క్వారీల నిర్వహణకు అనుమతులు ఒకచోట తీసుకుని మరోచోట పరిమితికి మించి తవ్వి, బిల్లులు లేకుండా తరలించేస్తున్నారు. గతేడాది క్వారీయింగ్, మైనింగ్ లీజు ప్రాంతాలు, ఖనిజ ఆధారిత నిర్మాణాలు, రహదారులపై తనిఖీలు వంటివి 355 కేసులు నమోదు చేశారు. రూ.254 కోట్ల జరిమానాలు విధించారు. ఇందులో రూ. 114 కోట్లు ఒక్క అనకాపల్లి కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ క్వారీ నిర్వాహకునిపైనే విధించడం విశేషం. ఎక్కువ భాగం విశాఖ జిల్లా క్వారీలపైనే జరిమానాలు వేశారు. విజయనగరం జిల్లాలో మాంగనీసు అక్రమ రవాణా, పార్వతీపురంలోని క్వార్ట్జ్ తవ్వకాలపైనా భారీగానే అపరాధ రుసుములు విధించారు. విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి క్వారీలపై దాడులు చేయడం, భారీగా జరిమానాలు వేయడంతో అదే స్థాయిలో ఆయనకు బెదిరింపులు వస్తుండేవి. గతేడాది ఈ బెదిరింపులు పెరగడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆయనకు భద్రతా సిబ్బందిని కేటాయించాల్సి వచ్చిందంటే దందా తీవ్రతను తెలుసుకోవచ్చు.