ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 5, 2021, 6:59 AM IST

Updated : Mar 5, 2021, 2:09 PM IST

ETV Bharat / state

విశాఖలో బంద్‌: డిపోలకే పరిమితమైన బస్సులు

విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పిలుపుతో రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ముందస్తుగా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 వరకు డిపోలకే పరిమితమవనున్నాయి. గమ్యస్థానాలకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు

bandh  in ap
రాష్ట్ర బంద్

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు నిచ్చిన బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భాజపా మినహా ఏపీలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. గమ్యస్థానాలకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడపబోమని.. మధ్యాహ్నం తర్వాత రోడ్ల మీద తిరుగుతాయని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

మన్యంలో ప్రశాంతంగా..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ పాడేరు మన్యంలో బంద్ జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బంద్​కు పిలుపు నిచ్చిన వామపక్షాలు కూడలిలో వాహనాలు నిలువరిస్తున్నారు. రహదారులన్నీ బోసిపోగా... ఆర్టీసీ బస్సులన్నీ డిపోకు పరిమితమయ్యాయి. నిరసనకారులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏజెన్సీలో తెదేపా మాజీ మంత్రి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బంద్​కు మద్దతు పలికి.. వామపక్షాలతో కలిసి ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనంపై వెళుతున్న వైకాపా పాడేరు ఎమ్మెల్యే .. తెదేపా నేత శ్రవణ్ కుమార్​ను పలకరించారు.

వెనక్కి తగ్గం..!

మద్దిలపాలెం జాతీయ రహదారివద్ద వామపక్ష, ప్రజా, విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం ఆగదని నేతలు అన్నారు. అధికార , ప్రతిపక్షాలు ఒక తాటి పైకి వచ్చి కేంద్రంతో చర్చలు చేసి ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునేలా ఒత్తిడిచేయాలని డిమాండ్ చేశారు.

నర్సీపట్నంలో బంద్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పలు పార్టీలు ఇచ్చిన పిలుపుతో నర్సీపట్నంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు పట్టణంలోనే వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ సర్వీసులను నిలిపివేయడంతో నర్సీపట్నం కాంప్లెక్స్ వెలవెలబోయింది. పట్టణంలోని ప్రభుత్వ ,ప్రైవేటు ,విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరోపక్క మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాలకు కూడా తాత్కాలికంగా స్వస్తి పలికాయి.

రాష్ట్ర బంద్

అనకాపల్లిలో సంపూర్ణ మద్దతు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో బంద్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్​కి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి..

విశాఖ జిల్లా గోపాలపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభ్యుడు గణబాబు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌

Last Updated : Mar 5, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details