NARA LOKESH YUVA GALAM PADAYATRA : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 40వ రోజు మదనపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు దేవతా నగర్ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. యువత, మహిళలు, చిన్నారులు లోకేశ్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. మదనపల్లె గ్రామీణ దేవతా నగర్ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర పట్టణంలోకి ప్రవేశించింది. టీడీపీ నేతలు గజమాలలతో లోకేశ్‌ను సత్కరించారు. మహిళలు దారిపొడవునా హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం వరకు మదనపల్లెలో లోకేశ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. టీకేఎన్ వెంచర్ అన్నమయ్య నగర్లో జరగనున్న బహిరంగ సభలో లోకేశ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
లోకేశ్‍కు సమస్యలు తెలిపిన బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి: యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‍కు.. రహదారి పై తారసపడుతున్న వ్యక్తులే కాకుండా వాహనాలపై వెళ్లే ప్రజలూ.. సమస్యలు తెలియజేస్తున్నారు. నిన్న మదనపల్లె నియోజకవర్గంలోని ఆరోగ్యవరం సమీపంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‍కు .. పీలేరు వైపు వెళ్తున్న బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు అభివాదం చేశారు. లోకేశ్ బస్సు దగ్గరికి వెళ్లి మాట్లాడటంతో తన ఆవేదనను వెలిబుచ్చారు. ఢీ ఫార్మసీ చదువుతున్న తన కుమారుడికి ప్రభుత్వం నుంచి ఫీజు రాయితీ సొమ్ము రాలేదని తెలిపారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో లక్షా 80 వేల రూపాయలు అప్పు చేసి చెల్లించానని వివరించారు. విద్యార్ధులకు ఫీజు రాయితీల చెల్లింపులో ప్రభుత్వ వైఖరి పై ప్రశ్నించాలని లోకేశ్‍కు ఆయన సూచించారు. ఈ విషయంపై పోరాటం చేస్తామని ఆయనకు లోకేశ్ హామీ ఇచ్చారు.