ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇదీ సంగతి: ఇంట గెలిచి... అంతెత్తుకు ఎదిగి!!

పల్లె వాకిట్లో తొలి అడుగు వేశారు.. రాజకీయ ఓనమాలు దిద్దారు. సర్పంచులుగా ఎన్నికై ప్రజల మన్ననలు పొంది... ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. నాయకులుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ రాజకీయ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను చేరారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులుగా వివిధ పదవులను చేపట్టి పల్లెదిద్దిన పాలకులయ్యారు.

ap local polls 2021
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు

By

Published : Feb 10, 2021, 1:41 PM IST

సర్పంచి.. పంచాయతీకే పరిమితమైన పదవి అనుకుంటారు కొందరు... దాన్నే తమ ఉన్నతికి నిచ్చెనగా మార్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో రాణించిన వారెందరో. పలువురు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మరి కొందరు ఎంపీలుగా దిల్లీ వరకు తమ సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలా చాలా మంది నేతలు ఉన్నారు. పల్లె పీఠం నుంచి చట్టసభల వరకూ సాగిన వారి ప్రస్థానాలు ఇలా ఉన్నాయి.

పార్లమెంటుకు ‘పాలవలస’

పాలకొండకు చెందిన పాలవలస రాజశేఖరం సర్పంచి పదవి నుంచే తన ప్రస్థానం ప్రారంభించి ఎంపీ స్థాయి వరకు చేరారు. వీరఘట్టం మండలం నీలానగరం సర్పంచిగా 1970-74 మధ్య పని చేశారు. 1974-76 మధ్య శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా చేశారు. 1976లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 1992-94ల మధ్యకాలంలో డీసీసీబీ అధ్యక్షునిగా, 1994-99లో ఉణుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006-11 మధ్యకాలంలో జిల్లా పరిషత్తు అధ్యక్షునిగా సేవలందించారు.

మంత్రి దాకా ఎదిగారు

జిల్లా రాజకీయాలను రెండు దశాబ్దాల పాటు శాసించిన గొర్లె శ్రీరాములునాయుడు తన స్వగ్రామం పాతర్లపల్లి సర్పంచిగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టేవరకు ఎదిగారు. 1959లో పాతర్లపల్లి సర్పంచిగా ఎన్నికైన ఆయన 1964లో సమితి అధ్యక్షుడిగా ఎన్నికై జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1978 ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్రంలో సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా ఉంటూనే 1981 జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

ఎంపీగా అప్పయ్య దొర..

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన హనుమంతు అప్పయ్యదొర రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. బెండి గ్రామం వార్డు సభ్యునిగా 1961లో అప్పయ్యదొర గెలిచి సర్పంచిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాశీబుగ్గ సమితి అధ్యక్షుడిగా రాణించారు. అనంతరం 1985లో శ్రీకాకుళం ఎంపీగా, 1995, 2004లో టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి గెలిచారు.

‘పేట’ నుంచే అయిదుగురు..

పోలాకి మండలం మబగాం నుంచి 1981లో ధర్మాన ప్రసాదరావు సర్పంచిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దాలిబాబు అనే అభ్యర్థిపై అప్పట్లో విజయం సాధించారు. అనంతరం ఆయన 1985లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తదుపరి 1987లో పోలాకి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1989లో మళ్లీ నరసన్నపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

డోల సీతారాములు...

దివంగత మాజీ ఎమ్మెల్యే డోల సీతారాములు తన స్వగ్రామం పోలాకి మండలం డోల నుంచి పంచాయతీ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1963 నుంచి 1978 వరకు సర్పంచిగా సేవలందించారు. అనంతరం నరసన్నపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. డీసీసీబీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికై సేవలందించారు.

మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు...

జలుమూరు మండలం అచ్యుతాపురం పంచాయతీ సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు1970 నుంచి 1981 వరకు సేవలందించారు. అనంతరం. ఆయన కోటబొమ్మాళి సమితి అధ్యక్షులుగా, 1983 నుంచి 1986 వరకు జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా పనిచేశారు. 1994 నుంచి 99 వరకు నరసన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగారు.

దివంగత నేత శిమ్మ ప్రభాకరరావు...

దివంగత నేతశిమ్మ ప్రభాకరరావునరసన్నపేట మండలం కిళ్లాం గ్రామం నుంచి సర్పంచిగా తొలుత తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983లో తెదేపా ఆవిర్భావంతో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి డోల సీతారాములుపై విజయం సాధించారు. అనంతరం 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. శిమ్మ ప్రభాకరరావు కూడా డీసీసీబీ అధ్యక్షులుగా సేవలందించారు.

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి...

నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి1981లో పోలాకి మండలం మబగాం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 2005 నుంచి 2014 వరకు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులుగా సేవలందించారు. 2014లో నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఇదీ చదవండి

పల్లె తీర్పు: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details