ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో టెన్షన్​ టెన్షన్.. టీడీపీ వైసీపీ సవాళ్ల పర్వం.. ఇరువర్గాల పరస్పర దాడులు

Tension At Puttaparthi : సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రం వేడెక్కుతోంది. సవాళ్లతో నిన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి.. నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తి రణరంగంగా మారింది. తాజాగా పుట్టపర్తిలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లకు దిగుతూ పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటూ వివాదానికి దిగారు.

Tension At Puttaparthi
Tension At Puttaparthi

By

Published : Apr 1, 2023, 2:01 PM IST

Updated : Apr 2, 2023, 6:14 AM IST

Tension At Puttaparthi : వైసీపీ, తెలుగుదేశం నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దిగారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఉద్రిక్తతలతో అట్టుడికింది. పట్టణ అభివృద్ధిపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. సత్తెమ్మ ఆలయం వద్ద చర్చకు ఇరు పార్టీల నేతలు, శ్రేణులు సిద్ధపడ్డారు. ఈక్రమంలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో పల్లె రఘునాథరెడ్డిని నిర్బంధించారు. పోలీసులు కళ్లుగప్పి.. టీడీపీ కార్యాలయం గోడ దూకి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. అక్కడికి అప్పటికే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు.

హనుమాన్‌ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేశాయి. అడ్డొచ్చిన తెలుగుదేశం కార్యకర్తలపైనా దాడులకు దిగాయి. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న తెలుగుదేశం నేత పల్లె రఘునాథరెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లిన పోలీసులు.. పల్లె రఘునాథరెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఆ తర్వాత స్టేషన్‌ నుంచి సత్తెమ్మ ఆలయానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డి.. వైసీపీ ఎమెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ప్రమాణం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని అన్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిపై లోకేశ్‌ మాట్లాడినవన్నీ వాస్తవాలేనన్నారు. MLA శ్రీధర్‌రెడ్డి వస్తే ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు.

వైసీపీలో ఓటమి భయంతో ఫ్రస్టేషన్: పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పుట్టపర్తిలో దాడుల ఘటనను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవన్నారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని విమర్శించారు.

సమాధానాలు చెప్పలేక దాడులకు దిగటం పిరికిపంద చర్య:పుట్టపర్తి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరా తీశారు. రాప్తాడు క్యాంప్ సైట్ నుంచి పుట్టపర్తి నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. పల్లె రఘునాథ్ రెడ్డిపై వైసీపీ గుండాలు దాడి చేశారని లోకేశ్​కు నేతలు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగటం.. పిరికిపంద చర్య అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఉన్న మాట అంటే ఉలుకెందుకు ఎద్దేవా చేశారు. దొంగ‌ల‌ని దొంగా అంటే వైసీపీ గూండాలు దాడుల‌కి దిగారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధ‌ర్ రెడ్డి అవినీతి చేశార‌ని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ప్రమాణం చేశారని, నీతిమంతుడైతే వైసీపీ ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. పోలీసుల్ని ప్రయోగించి, వైసీపీ గూండాల‌తో దాడుల‌కి పాల్పడ్డారంటే అవినీతి చేసినట్లు ఒప్పుకున్నట్టేనని.. రౌడీల‌కి టీడీపీ భ‌య‌ప‌డ‌దు, వెన‌క్కి త‌గ్గదని తేల్చిచెప్పారు.

పుట్టపర్తిని అరాచకాలకు నిలయంగా మార్చారు:జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి.. పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయటం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు. ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని అచ్చెన్న ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలు పూటుగా మద్యం తాగి దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వైసీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జీ చేయటం ఏంటని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. దాడికి సంబంధంచిన వీడియోను అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

"పవిత్రమైన పుట్టపర్తిలో .. శ్రీ సత్యసాయి నడయాడిన ఈ ప్రదేశంలో ఎప్పుడూ ఇటువంటి సంస్కృతి లేదు. నిజంగా చాలా బాధ పడుతున్నాము. దీనికి అంతటీకి కారణం ఎమ్మెల్యే శ్రీధర్​. ఆయన అధికారంలోకి రాగానే ఈ పవిత్రమైన పుట్టపర్తిలో విష సంస్కృతిని ప్రారంభించాడు. ఆయనకు కావాల్సింది డబ్బు సంపాధించటం. మొట్ట మొదటగా బిల్డర్లను పీల్చి పిప్పి చేశాడు. ఎవరు లే అవుట్లు వేసినా, భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఈయనకు కప్పం కట్టాల్సిందే. ఇదే అంశాలను లోకేశ్​ పాదయాత్రలో మాట్లాడారు. ఇలాంటి సంస్కృతి పుట్టపర్తిలో పోవాలి. నేను ఎమ్మెల్యేగా చేశాను."- పల్లె రఘునాథరెడ్డి, తెలుగుదేశం నేత

సవాళ్ల పర్వం.. పుట్టపర్తిలో టెన్షన్​.. ఇరువర్గాల పరస్పర దాడులు

ఇవీ చదవండి:

Last Updated : Apr 2, 2023, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details