‘ప్రశ్నించానని పాలు రానీయకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి నీళ్లు లేకుండా చేశారు. జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం. ఇలా ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా జరుగుతుందా. నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం..’ అంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది.
ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ.. ‘నెల రోజుల క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అల్లూరు వచ్చినప్పుడు ఆయనను ప్రశ్నించాను. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆయన అనుచరులు ఇంటి గేటుకు తాళం వేశారు. రైతు సమస్యలపై ప్రశ్నించినందుకు ఇలా బంధిస్తే ఎలా బతికేది? నాయకులు, పోలీసులు ఆయనకు వంతపాడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
ఆడపిల్లకు భద్రత లేకుంటే ఎక్కడ బతకాలో మీరే చెప్పండి జగనన్నా? నాకేమైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వంద శాతం బాధ్యుడు. ఎన్ని రోజులైనా ఇక్కడే భూస్థాపితం అయిపోతాను..’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.