విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రజలను ఆకట్టుకుంటున్న గణనాధుని ప్రతిమ పార్వతీపురంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా విలయతాండవం చేస్తున్న నేటి తరుణంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల పోలిన ఆకారంలో వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేవుడే స్వయంగా వారి రూపాల్లో వచ్చి ప్రజలకు సేవలందిస్తున్నట్టుగా భావించి తయారు చేసినట్లు తయారీదారులు పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ ఇంట్లో మైదా పిండి, పసుపు, మిర్యాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజలు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు వివిధ రకాల గణనాథులను తయారు చేస్తుంటారు. ఈ కోవలోనే ఉయ్యారు వాసి వెలివెల రాజేశ్వరి ఇంట్లో నిత్యం ఉండే సామాన్లతో ఓ సుందరమైన గణపతిని తయారు చేశారు. మైదా పిండి, పసుపు, మిర్యాలను ఉపయోగించి బొజ్జ వినాయకుడితో పాటుగా, ఎలుక వాహనాన్ని తయారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుని కరోనాకు దూరంగా ఉందామని ఆమె తెలిపారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా కనిగిరిలో మట్టి విగ్రహాలను స్వయంగా తయారు చేసి పంచుతున్న ఎస్సై కనిగిరిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలోనే వినాయక చవితిని నిర్వహించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే వాడాలని ఎస్సై శివనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బంకమట్టిని తెప్పించి... సుమారు 500 మట్టి వినాయక ప్రతిమలను ఎస్సై స్వయంగా తయారు చేసి పట్టణ వాసులకు పంచిపెట్టారు.
ప్రకాశం జిల్లా ఈపురుపాలెంకు చెందిన కళాకారుడు శంకర్ అట్టముక్కలతో చేసిన విఘ్నేశ్వరుడు చీరాల మండలం ఈపురుపాలేనికి చెందిన కళాకారుడు శంకర్... చీరలు భద్రపరిచే అట్టముక్కలతో తయారు చేసిన గణపతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. సుమారు ఐదు అడుగుల విగ్రహాన్ని తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన రంగులను అద్దాడు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా పర్యావరణహిత విఘ్నేశ్వరుడిని రూపొందించినట్లు శంకర్ తెలిపారు.
ఇదీ చదవండి:
వైకాపా, తెదేపా కేంద్ర కార్యాలయాల్లో ఘనంగా వినాయక చవితి