గిరిజనుల స్థితి గతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రకాశం జిల్లా పాలనాధికారి పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. సామాజిక ఆర్థికాభివృద్ధిపై ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సర్వే ఆధారంగా జీవనోపాధిని పెంచాలని తెలిపారు. జిల్లా జనాభాలో 8.81 శాతం ఎస్టీలు ఉన్నారని, అందులో యానాది, చెంచు, సుగాలీలు, నక్కల వారు 1,51,145 మంది ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యంగా వారికి వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
చెంచు ప్రాంతాల్లోని యువతీ, యువకుల భావిష్యత్తుకు మార్గ నిర్దేశం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలన్నారు. అర్హులకు రేషన్ కార్డులు, జాబ్ కార్డులు ఇవ్వాలని, గృహాల నిర్మాణానికి ప్రోత్సహించాలన్నారు. అటవీ ప్రాంతంలోని ఆర్వోఎస్సార్ కింద 1,559 మందికి 3,780 ఎకరాలకు హక్కు పత్రాలు ఇటీవల పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ భూములను ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. పంపిణీ చేసిన భూముల్లో వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేయాలని ఆదేశించారు.