నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్ళకు పొగాకు బోర్డు రంగం సిద్దం చేస్తోంది. రెండు ప్రాంతాల్లో మార్చి 15 నుంచి ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి, కందుకూరు 1, 2.. కనిగిరి, నెల్లూరు జిల్లా పిసిపల్లి, కలిగిరి లో ఆరు ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేసి ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎస్బీఎస్లో వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, కొండెపిలో ఉన్న 5 ప్లాట్ ఫారాల్లో కొనుగోళ్ళు చేయనున్నారు.
అక్కడ ముగిస్తే.. ఇక్కడ ప్రారంభమవుతాయి..
రెండు ప్రాంతాల్లో కలిపి 66 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు చేయనున్నారు. గత ఏడాది 83 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు అనుమతించగా.. ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు, మార్కెటింగ్ సమస్య కారణంగా లక్ష్యాన్ని తగ్గించారు. మరోవైపు.. కర్ణాటకలో ప్రస్తుతానికి ప్రక్రియ జరుగుతున్న కారణంగా.. బయ్యర్లు అక్కడ నుంచి ఇక్కడకు రావాల్సి ఉంది. దీంతో అక్కడ కొనుగోళ్లు పూర్తయ్యే లోపే ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.