వేసవి ఆరంభంలోనే తాగునీటి కష్టాలు Water Problem: వేసవి ఆరంభంలోనే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి.. అక్కడి ప్రజలు ఇప్పటినుంచే ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడితో గంటల తరబడి పడిగాపులు కాసి.. వచ్చే అరకొర నీటిని పట్టుకొని కాలం వెళ్లబుచ్చుతున్నామని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలోని పలు గ్రామాలు వెలిగొండ ప్రాజెక్టుకు పదుల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో.. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి వేసవి ఆరంభంలోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట, చాట్లమడ ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. మూడు గ్రామాలకు కలిపి ఒక్క బోరు మాత్రమే ఉంది. దానిలో కూడా అరకొర నీరే వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. కూలీ పనులు మానుకొని మరీ నీటి కోసం ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు చెబుతున్నారు. అసలే అరకొర పనులతో అలాడుతుంటే.. నీళ్ల కోసం ఇంటి వద్ద ఉంటే ఇక తమకు పూట ఎలా గడిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నీటితో 15 నిమిషాలకు ఒక్క బిందె కూడా నిండదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే మంత్రి సురేష్ నియోజకవర్గమని.. ఏనాడూ గ్రామాలను సందర్శించి తమ కష్టాలను తీర్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులకు గత ఏడాది నుంచి బిల్లులు రాకపోవడంతో ట్యాంకర్లతో నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీటి సమస్య మరింత అధికమైందని ఆయా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నీటి కొరత వల్ల పశువులను సైతం అమ్ముకుంటున్నామని తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇక తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మూడు గ్రామాలు కలిపి సుమారు 600 గృహాలు ఉంటాయని.. అందరికీ ఇదే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఉన్న ఒక్క బోరు వద్దకు నీటి కోసం వచ్చినప్పుడు పట్టుకునే విషయంలో గొడవలు సైతం జరుగుతున్నాయన్నారు. ఉన్నతాధికారులు తమ గ్రామాలపై దృష్టి సారించి నీటి కష్టాలు తీర్చాలని ఆయా గ్రామస్థులు వేడుకుంటున్నారు. నీళ్లు కొందామన్నా లభించని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
'మాకు నీటి సమస్య అధికంగా ఉంది. నీరు పట్టుకోవాలంటే ఉదయం 3 గంటల నుంచి లైన్లో నిలబడాలి. నీరు కొనుకుందామన్నా రావడం లేదు. పాలేం, అగ్రహారం, , చాట్లమడ గ్రామాలకు ఈ నీరే వాడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ట్రాక్టర్‌తో నీరు తేవడం లేదు. నీటి కోసం పాలెం గ్రామస్థులతో గొడవలు పడాల్సి వస్తోంది. ఇక్కడ మంత్రి సురేష్ ఉన్నారు. ఆయన వద్దకు సమస్యలపై వెళ్లితే ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. నీరు లేకపోవడంతో రెండు రోజులకు ఒక్కసారి స్నానం చేస్తున్నాం. ఆటోలు, బైక్‌లు ఉన్నవారు పొలాల వద్ద నీరు తెచ్చుకుంటున్నారు.'దుద్యాల కోటిరెడ్డి, గ్రామస్థుడు
ఇవీ చదవండి: