ఆ ఇద్దరు విద్యార్థులు చనిపోయారన్న సంగతి వసతి గృహ అధికారులకు.. తల్లిదండ్రులకూ తెలియదు. ఓ విద్యార్థి తండ్రి వసతి గృహంలో చదువుకుంటున్న కొడుకును పలకరించాలని వచ్చాడు. కానీ... ఆ తండ్రికి వసతి గృహ అధికారులు చెప్పిన మాటలు విని ఏం జరిగిందో అర్థం కాలేదు. తన బిడ్డ హస్టల్లోనే ఉన్నాడంటూ.. ఇంటికి రాలేదంటూ ఆందోళన చెందాడు. అనంతరం ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు భయంకరమైన చేదు నిజం బయటపడింది.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం వేలూరు పంచాయతీ పరిధిలోని టి.సల్లూరు గ్రామానికి చెందిన ఇండ్లా సూర్యం (13), నల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన చిన్నపు రెడ్డి బ్రహ్మారెడ్డి(12) చీమకుర్తిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ... ప్రభుత్వపాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీన సెలవు పత్రం ఇచ్చి ఇంటికి బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యం చేరకుండానే ముగిసిపోయింది. ఇంటికి వెళ్తూ.. సరదాగా ఈత కొడదామని తరచూ స్నానం చేసే మూసీ వాగులోకి దిగారు. అదే వారికి ఆఖరి సరదా అయింది.