తెలుగువారి పౌరుషం, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఒంగోలు ఆవులు ప్రపంచవ్యాప్తంగా పాడి ఉత్పత్తిలో ఢంకా బజాయిస్తున్నాయి. మన సొంత సంతతి విశిష్టతను మనం తెలుసుకునేలోపే... ఇక్కడి మేలు జాతి అంతా విదేశాలకు తరలిపోయింది. ప్రకృతి సేద్యం పుణ్యమాని... ఇప్పుడు ఒంగోలు ఆవులకు మంచి రోజులొచ్చాయి. అవసరం వచ్చింది కదాని కొందామంటే శ్రేష్ఠమైనవి దొరకడం లేదు. 9 నెలల దూడను కొనాలంటేనే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు అవుతోంది. ఆవులైతే రూ.40వేల పైమాటే. ఇక గిత్తలకు రూ.3లక్షల నుంచి రూ.50లక్షల వరకు పలుకుతోంది. సాధారణ రైతులకు వీటిని కొనడం అసాధ్యం కావడంతో... గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్థానంలో దేశవాళీ ఆవుల్ని పిండమార్పిడి విధానంలో అభివృద్ధి చేస్తున్నారు.
బ్రెజిల్‌లో 18 కోట్ల ఆవులు...
కృష్ణా నదికి దక్షిణాన, పెన్నాకు ఉత్తరాన గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ రకం సంతతి అభివృద్ధి చెందింది. 1900 సంవత్సరంలో ప్రతి రైతు ఇంట్లో నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులు, ఊరికి రెండు, మూడు శ్రేష్ఠమైన ఆబోతులుండేవి. 1875-1960 మధ్య కాలంలో నాణ్యమైన ఒంగోలు జాతి ఆవులు, ఆబోతుల్ని బ్రెజిల్, కొలంబియా, వెనెజువెలా, అమెరికా, ఆస్ట్రేలియా, జమైకా తదితర దేశాలకు తరలింపు మొదలైంది. ముఖ్యంగా 1961-62 మధ్య బ్రెజిల్ నుంచి ప్రత్యేక బృందం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు వచ్చి 107 ఆవులతోపాటు కొన్ని ఎద్దులు తీసుకెళ్లారు. ఇప్పుడక్కడ 18 కోట్ల ఒంగోలు జాతి ఆవులు ఉండటం గమనార్హం.
టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానంపై ఆశలు...
ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండమార్పిడి సాంకేతికత ద్వారా దేశవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరులోని శ్రీవెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్థానం(లాం)లోని పిండోత్పత్తి జీవ సాంకేతిక ప్రయోగశాలను కేంద్ర పశుపాలన, డెయిరీ, మత్స్య పాలనావిభాగం గుర్తించింది. ఇక్కడ ఒంగోలు, పుంగనూరు, గిర్ ఆవుల అభివృద్ధి పథకాన్ని చేపట్టారు.
* సాధారణంగా.. ఒక ఆవు జీవితకాలంలో ఎనిమిది నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది. ఐవీఎఫ్, పిండమార్పిడి విధానంలో ఒక మేలు జాతి ఆవు నుంచి 50 నుంచి 100 పిండాలను ఉత్పత్తి చేసి, 30 నుంచి 40 దూడలను పొందవచ్చు.
* ఐవీఎఫ్ ప్రయోగాల్లో భాగంగా... మేలుజాతి ఆవుల నుంచి అపరిపక్వ మాతృ జీవకణాల్ని సేకరించి.. ఇంక్యుబేటర్‌లో మేలు జాతి ఆబోతు వీర్య కణాలతో సంపర్కం చేస్తారు. అనంతరం ఫలదీకరణం చెందిన పిండాలను అద్దె గర్భంలోనికి ఎక్కించడం ద్వారా అత్యుత్తమ జన్యు సంపద కలిగిన సంతతిని పుట్టిస్తారు.