YSRCP MP’s son Magunta Raghava Reddy arrested by ED: దిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్టుచేసిన ఈడీ...సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు వసూలు చేసి ముడుపులు ముట్టజెప్పిన కేసులో రాఘవ కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మొత్తంలో 30 కోట్ల వివరాలు తెలుసుకునేందుకు రాఘవరెడ్డిని పదిరోజులు కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు రాఘవరెడ్డిని పదిరోజుల కస్టడీకి అనుమతిస్తూ... దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులోఈనెల 8న అరెస్టుచేసిన బుచ్చిబాబు కస్టడీ ఇవాళ ముగియడంతో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది.
దిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పాత్ర కీలకమని ఈడీ తెలిపింది. రాఘవరెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. దిల్లీ కోర్టులో హాజరు పరిచారు. మాగుంట రాఘవకు మద్యం తయారీ, హోల్ సెల్ వ్యాపారం ఉన్నాయని.. రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నట్లు వివరించారు. సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు వసూలు చేసి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా ముడుపులు ముట్టజెప్పారని కోర్టుకు నివేదించారు. 100 కోట్ల ముడుపుల్లో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అమిత్ ఆరోరా, బినోయ్ బాబు, బుచ్చిబాబు అరెస్టు అయ్యారని... దర్యాప్తు పురోగతిలో ఉందని కోర్టుకు చెప్పారు. ఇప్పటికే అరెస్టైన శరత్ చంద్రారెడ్డితో రాఘవరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.
ఇండో స్పిరిట్ కంపెనీలో సమీర్ మహేంద్రుతో పాటు మాగుంట రాఘవరెడ్డికి భాగస్వామ్యం ఉందని... ఆ సంస్థ నుంచి షేర్ కూడా వెళుతుందన్నారు. దిల్లీ మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు హవాలా మార్గంలో ముడుపులు ఇచ్చారని కోర్టుకు వివరించారు. పీఎమ్ఎల్ఏ చట్టం సెక్షన్ 50 ప్రకారం 30 మంది స్టేట్ మెంట్లు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ వివరాలను ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పొందిపరిచామన్న ఈడీ అధికారులు కార్టలైజేషన్ , సంబంధిత వ్యక్తులకు ముడుపులు చేరవేయడంలో వీరు ముఖ్యమైన వాళ్లని అన్నారు. ముడుపుల్లో 30 కోట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు... రాఘవరెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన కొద్దిపాటి దర్యాప్తులోనే ఇన్నిరకాల విషయాలు బయటికి వచ్చాయని.. ఈ కేసుతో సంబందం ఉన్నవారందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న రాఘవరెడ్డిని మరింతగా ప్రశ్నిస్తే చాలా వివరాలు తెలుస్తాయని కోర్టుకు ఈడీ తెలిపింది.