ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక ఎన్నికలు వాయిదా వేయటం హర్షణీయం: తెదేపా

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయటంపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా కార్యకర్తలు దౌర్జన్యంతో సాగిన ఈ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి... కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

TDP Leaders thanks on Election commision with postphone elections
ఎన్నికల వాయిదా వేయటం పై మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేతలు

By

Published : Mar 15, 2020, 10:04 PM IST

ఎన్నికల వాయిదా వేయటం పై మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేతలు

ఎన్నికల కమిషన్​ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై తెదేపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకుని ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

వైకాపా శ్రేణులు బెదిరింపులకు పాల్పడ్డారు: చినరాజప్ప

స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడం అభినందనీయమని మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో అధికారులు సైతం ప్రభుత్వం చెప్పినట్లే చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలు రాష్ట్రంలో భయాందోళనలను కలిగిస్తున్నారని... నామినేషన్లు వేయకుండా బెదిరించారని ఆరోపించారు. చిత్తూరులో ఏకగ్రీవం కావడమేంటని... ప్రజాస్వామ్యం ఎక్కడుందని... కలెక్టర్‌, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల బలంతోనే అన్నీ ఏకగ్రీవమయ్యాయన్నారు.

కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి: సోమిరెడ్డి

దౌర్జన్యం, అరాచకత్వంతో సాగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్​ చేశారు. పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే నెల్లూరు జిల్లాలో తాము ఎన్నికలు బహిష్కరిస్తామని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కిడ్నాపులు, బెదిరింపులతో ఎన్నికల ప్రక్రియ సాగిందని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. 652 జడ్పీటీసీ స్థానాలకు గాను 150 స్థానాల్లో పోటీ లేదని, 2,129 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి తాము ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లాలో రాత్రి పది గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయన్నారు. గుంటూరు, చిత్తూరు అధికారులపై చర్యలు తీసుకుంటే సరిపోదని... రాష్ట్రవ్యాప్తంగా అరాచకం కొనసాగినందున ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులే అభ్యర్థులను బెదిరించి విత్ డ్రాలు చేయించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు.

వేటు వేయటంతో రుజువైంది: మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

రాష్ట్రంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనడానికి ఎన్నికల కమిషన్​ జిల్లా స్థాయి అధికారులపై వేటు వేయటంమే నిదర్శనమని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిపై కూడా ఈసీ పునఃసమీక్ష జరపాలన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయ పోరాటానికి సిద్ధమని... దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి చెప్పారు.

ఇవీ చదవండి...'స్థానికం'లో జిల్లాలకు జిల్లాలే వైకాపా పరం

ABOUT THE AUTHOR

...view details