ఉపరితల ఆవర్తనంతో కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు అనేక గ్రామాల్లో వరి నార్లు, పంట పొలాలు నీటమునిగాయి. ఇంకోవైపు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్క దీపావళి రోజు మినహా గడిచిన అయిదు రోజులుగా జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి.
ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద..ఈ పరిమాణాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిండు కుండలను తలపిస్తున్న జలాశయాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సోమశిల, కండలేరు, కనిగిరి, గండిపాళెం, స్వర్ణముఖి బ్యారేజీల వద్ద నీటి ఉద్ధృతిని అంచనా వేస్తోంది. గండిపాళెం మినహా.. మిగిలిన చోట్ల నిల్వ మట్టం పెరుగుతుండటంతో సామర్థ్యం మేరకు ఉంచేందుకు యత్నిస్తున్నారు. ఒక వేళ ప్రవాహం మరింత పెరిగితే దిగువకు విడుదల చేసేందుకూ సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కనిగిరి జలాశయానికి సంబంధించి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఓజిలి మండలం నెమల్లపూడి వద్ద మామిడి కాలువ వంతెనపై వరద నీరు ప్రవహించింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ వద్ద వరద నీరు పెరగడంతో మూడు గేట్లు ఎత్తారు. చేజర్ల మండలం టీకేపాడు వద్ద నల్లవాగు పొంగిపొర్లడంతో అధికారులు అడ్డుగా కంచె వేసి రాకపోకలను నియంత్రించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం ఎస్టీ కాలనీలో రెండు పూరిళ్లు నేల కూలగా.. పెనుబల్లి ఎస్సీ కాలనీలో వర్షపునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.