ఏడాది కిందట వాయిదా పడిన పురపోరును అధికారులు మంగళవారం ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆపేసిన ప్రక్రియను... తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల పరిధిలో 98 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా- వీటిలో పోటీకి 568 మంది నామినేషన్లు వేశారు. అధికారులు వాటిలో 25 తిరస్కరించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియకు బుధవారం మధ్యాహ్నం 3 వరకు సమయం ఉంది. తొలిరోజు నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 158 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు 121 మంది నామినేషన్లు వేయగా.. తొలి రోజు 43 మంది ఉపసంహరించుకున్నారు. 3, 5, 22 వార్డుల్లో ఒక్కటి చొప్పున మాత్రమే దాఖలైంది. వారంతా వైకాపా మద్దతుదారులే. నాయుడుపేటలో 25 వార్డులకు దాఖలైన 160 నామినేషన్లలో 81 ఉపసంహరించుకున్నారు. ఫలితంగా 3, 4, 5, 7, 12, 13, 19 వార్డుల్లో ఒక్కటి మాత్రమే నమోదైంది. వెంకటగిరిలో 25 వార్డులకు పోటీ పడుతున్న 158 మందిలో 19 మంది నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు.