జనసేన పార్టీ "మన ఆత్మకూరు-మన అభివృద్ధి" కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే నిర్మాణంలోని బొగ్గేరు వాగు వంతెన పనులను పరిశీలించారు.
శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం 2011-12లో మంజూరైనా, నిధుల కేటాయింపులో జాప్యం జరిగిందని నలిశెట్టి శ్రీధర్ అన్నారు. చివరకు 2018 బడ్జెట్ లో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం 309 కిలోమీటర్ల రైలు మార్గంలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 148 కిలోమీటర్లు ఉందన్నారు. జిల్లాలోనే 15 స్టేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు.
ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ వ్యయం భరించాల్సి ఉందని, భూసేకరణ చేపట్టి రైల్వే శాఖకు అప్పగించాలని తెలిపారు. రైల్వే మార్గం నిర్మాణంలో అయ్యే ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఒప్పందంలో ఉందని చెప్పారు. రైలు మార్గం ఖర్చు రూ.2,454 కోట్లలో సగం రూ. 1,227 కోట్లు రాష్ట్రం ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. అయితే భూసేకరణకు నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీధర్ ఆరోపించారు. అందువల్లే రైలు మార్గం నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సత్వరమే విడుదల చేసి జిల్లాలోని మెట్ట ప్రాంతవాసుల దశాబ్దాల కలను సాకారం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
'కరోనా నివారణ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి'